గెలుపు గులాల్ | India Beat Bangladesh In Kolkata Pink Test | Sakshi
Sakshi News home page

గెలుపు గులాల్

Nov 25 2019 4:20 AM | Updated on Nov 25 2019 9:10 AM

India Beat Bangladesh In Kolkata Pink Test - Sakshi

47 నిమిషాలు...8.4 ఓవర్లు... మూడో రోజు ఉదయం బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ ముగియడానికి పట్టిన సమయమిది! అనూహ్యం, ఆశ్చర్యంలాంటివేమీ లేకుండా అంచనాలకు తగినట్లుగానే మ్యాచ్‌ ముగిసింది... ఆటకంటే కూడా గులాబీ బంతి తెచ్చిన అదనపు ఆకర్షణలతో ప్రత్యేకంగా మారిన టెస్టు మ్యాచ్‌లో ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌ మరో అద్భుత విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. వరుసగా మూడో సిరీస్‌ విజయంతో వరల్డ్‌ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో మరింత పైపైకి దూసుకుపోయింది.

ఆదివారం ఆటలో ఉమేశ్‌ పేస్‌ బౌలింగ్‌ ప్రదర్శన హైలైట్‌గా నిలవగా, స్పిన్నర్‌ వికెట్‌ తీయాల్సిన అవసరం  రాకుండానే సొంతగడ్డపై టెస్టు గెలవడంవంటి ఎన్నో ఘనతలతో కోల్‌కతా మ్యాచ్‌  చిరస్మరణీయంగా మారింది.  ఈ సిరీస్‌తో భారత్‌ ఐదు టెస్టుల ‘హోం సీజన్‌’ ముగియగా   స్వదేశంలో మన జట్టు టెస్టు ఆడాలంటే 2021 వరకు ఆగాల్సిందే!

కోల్‌కతా: భారత్‌లో జరిగిన తొలి డే అండ్‌ నైట్‌ టెస్టులో టీమిండియా తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటింది. ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో ఆదివారం ముగిసిన రెండో టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్, 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 195 పరుగులకే ఆలౌటైంది. ముష్ఫికర్‌ రహీమ్‌ (96 బంతుల్లో 74; 13 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ 5 వికెట్లు పడగొట్టగా, ఇషాంత్‌ 4 వికెట్లు తీశాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు ఇషాంత్‌కే దక్కాయి. ఇండోర్‌లో జరిగిన తొలి టెస్టునూ నెగ్గిన భారత్‌ 2–0తో సిరీస్‌ సొంతం చేసుకుంది. తమ తర్వాతి పరిమిత ఓవర్ల పోరులో వచ్చే నెల 6నుంచి వెస్టిండీస్‌తో భారత్‌ తలపడుతుంది.

గులాబీ బంతితో ఇప్పటి వరకు 12 డే అండ్‌ నైట్‌ టెస్టులు జరగ్గా, అన్నింటిలో ఫలితం రావడం విశేషం. ఓవర్‌నైట్‌ స్కోరు 152/6 స్కోరుతో ఓటమి అంచున నిలిచిన బంగ్లా ఆదివారం మరో 43 పరుగులు జోడించి ఆలౌటైంది. బంగ్లా కోల్పోయిన మూడు వికెట్లను కూడా ఉమేశ్‌ పడగొట్టడం విశేషం. ముందుగా ఇబాదత్‌ (0)ను బౌన్సర్‌తో అవుట్‌ చేసిన ఉమేశ్‌ ప్రత్యర్థి పతనాన్ని మొదలు పెట్టాడు. ఈ దశలో ముష్ఫికర్, అల్‌ అమీన్‌ కాస్త వేగంగా ఆడి పరుగులు జోడించేందుకు ప్రయతి్నంచారు. ఒక దశలో 11 బంతుల వ్యవధిలో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ ఐదు ఫోర్లు బాదారు. అయితే ఇదే జోరులో ముషి్ఫకర్‌ అవుట్‌ కాగా... ఉమేశ్‌ తన తర్వాతి ఓవర్‌ తొలి బంతికే అల్‌ అమీన్‌ను అవుట్‌ చేయడంతో బంగ్లా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. శనివారం కండరాల నొప్పితో రిటైర్ట్‌హర్ట్‌గా వెనుదిరిగిన మహ్ముదుల్లా మళ్లీ బ్యాటింగ్‌కు రాకపోవడంతో భారత్‌ గెలుపు ఖాయమైంది.

స్కోరు వివరాలు
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: 106, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 347/9 డిక్లేర్డ్, బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌: షాద్‌మన్‌ (ఎల్బీ) (బి) ఇషాంత్‌ 0; కైస్‌ (సి) కోహ్లి (బి) ఇషాంత్‌ 5; మోమినుల్‌ (సి) సాహా (బి) ఇషాంత్‌ 0; మిథున్‌ (సి) షమీ (బి) ఉమేశ్‌ 6; ముష్ఫికర్‌ (సి) జడేజా (బి) ఉమేశ్‌ 74; మహ్ముదుల్లా (రిటైర్డ్‌హర్ట్‌) 39; మెహదీ హసన్‌ (సి) కోహ్లి (బి) ఇషాంత్‌ 15; తైజుల్‌ (సి) రహానే (బి) ఉమేశ్‌ 11; ఇబాదత్‌ (సి) కోహ్లి (బి) ఉమేశ్‌ 0; అల్‌ అమీన్‌ (సి) సాహా (బి) ఉమేశ్‌ 21; జాయెద్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (41.1 ఓవర్లలో ఆలౌట్‌) 195.  వికెట్ల పతనం: 1–0; 2–2; 3–9; 4–13; 4–82 (రిటైర్డ్‌హర్ట్‌); 5–133; 6–152; 7–152; 8–184; 9–195.
బౌలింగ్‌: ఇషాంత్‌ 13–2–56–4; ఉమేశ్‌ 14.1–1–53–5; షమీ 8–0–42–2; అశ్విన్‌ 5–0–19–0; జడేజా 1–0–8–0.

►4 భారత్‌ వరుసగా నాలుగో టెస్టులో ఇన్నింగ్స్‌ విజయం సాధించి ఈ ఘనత నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది. దక్షిణాఫ్రికాను పుణే, రాంచీల్లో ఇన్నింగ్స్‌ తేడాతో ఓడించిన టీమిండియా బంగ్లాను కూడా ఇండోర్, కోల్‌కతాలలో
చిత్తు చేసింది.  

►19 సిరీస్‌లో భారత పేసర్లు తీసిన వికెట్ల సంఖ్య. స్వదేశంలో ఇదే అత్యధిక వికెట్ల రికార్డు.  

►0 కోల్‌కతా టెస్టులో స్పిన్నర్లు తీసిన వికెట్ల సంఖ్య. భారత్‌లో స్పిన్నర్‌ ఒక్క వికెట్‌ తీయకుండా మన జట్టు గెలవడం ఇదే మొదటిసారి

►161.2కోల్‌కతా టెస్టు సాగిన ఓవర్లు. భారత గడ్డపై ఫలితం వచ్చిన టెస్టుల్లో బంతులపరంగా ఇదే అతి చిన్న మ్యాచ్‌.   

‘అద్భుతం. మా గణాంకాలు రోజురోజుకూ మరింత మెరుగవుతున్నాయి. మ్యాచ్‌ తొందరగా ముగిసిపోతుందని తెలిసినా ఇంత మంది జనం వస్తారని ఊహించలేదు. టెస్టులకు ఇలాంటి స్పందనే కావాల్సింది. విదేశాల్లో మాకు ఇదే కనిపిస్తుంది. స్వీయనమ్మకమే ఈ విజయాలు అందిస్తోంది. తాము ఎక్కడైనా వికెట్లు తీయగలమని మా బౌలర్లు నమ్మారు. ప్రస్తుతం మా మానసిక దృక్పథం చాలా బాగుంది. మేం దీనిని ఆస్వాదిస్తున్నాం. టెస్టు క్రికెట్‌ అంటే మానసిక యుద్ధం. ‘దాదా టీమ్‌’తోనే ఇది మొదలైంది.

నిజాయితీగా కష్టపడ్డాం. దానికి తగ్గ ఫలితాలు వస్తున్నాయి. టి20, వన్డేలలాగే టెస్టు క్రికెట్‌ను కూడా మార్కెటింగ్‌ చేయడం ఎంతో అవసరం. ఆటగాళ్లతో పాటు బోర్డులకు కూడా ఆ బాధ్యత ఉంది. ప్రేక్షకులను కూడా ఆటలో భాగం చేస్తే ఆసక్తి పెరుగుతుంది. లంచ్‌ సమయంలో చిన్నారులతో క్రికెటర్లు ముచ్చటించడం లాంటివి చేయవచ్చు. వరల్డ్‌ టెస్టు ఛాంపియన్ షిప్ లో మేం మూడు సిరీస్‌లు స్వదేశంలోనే ఆడాం కాబట్టి మా గురించి గొప్పలు చెప్పుకోవాలని భావించడం లేదు. నా దృష్టిలో ఒక సిరీస్‌ స్వదేశంలో, తర్వాతి సిరీస్‌ విదేశాల్లో ఉంటే బాగుంటుంది. పింక్‌ టెస్టు అనుభవం బాగుంది. ఇది ఆరంభం మాత్రమే. ఇకపై ఇలాంటివి చాలా చూడవచ్చు’
–విరాట్‌ కోహ్లి   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement