
కొలంబో: ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. పూల్ ‘ఎ’లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో జయంత్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా 74 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 281 పరుగులు చేసింది. దీపక్ హుడా (103 బంతుల్లో 105; 12 ఫోర్లు, సిక్స్) సెంచరీ చేయగా... జయంత్ యాదవ్ (31; 3 ఫోర్లు), అతీత్ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు.
282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 44.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. కరీమ్ జనత్ (58; 5 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీ చేసినా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. భారత బౌలర్లలో మయాంక్ మార్కండే, జయంత్ యాదవ్ మూడేసి వికెట్లు తీయగా... అంకిత్ రాజ్‌పుత్‌కు రెండు వికెట్లు లభించాయి. ఇదే పూల్‌లోని మరో మ్యాచ్‌లో శ్రీలంక 109 పరుగుల తేడాతో ఒమన్‌పై గెలిచింది. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో అఫ్గానిస్తాన్‌తో శ్రీలంక; ఒమన్‌తో భారత్ తలపడతాయి.