కోహ్లి వరల్డ్‌ రికార్డు.. సిరీస్‌ భారత్‌ కైవసం

IND Vs SL: Team India Beat Srilanka To Clinch T20 Series - Sakshi

పుణె: శ్రీలంకతో జరిగిన చివరిదైన మూడో టీ20లో టీమిండియా 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంకను 15.5 ఓవర్లలో 123 పరుగులకే కట్టడి చేసిన భారత్‌ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఫలితంగా సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా, రెండో టీ20లో భారత్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో  ధనంజయ డిసిల్వా(57), ఏంజెలో మాథ్యూస్‌ (31)లు రాణించగా మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. దాంతో లంకకు ఘోర ఓటమి తప్పలేదు.  టీమిండియా బౌలర్లలో సైనీ మూడు వికెట్లు సాధించగా, వాషింగ్టన్‌  సుందర్‌, శార్దూల​ ఠాకూర్‌లు తలో రెండు వికెట్లు తీశారు. బుమ్రాకు వికెట్‌ దక్కింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 202 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది.ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌(52), కేఎల్‌ రాహుల్‌(54)లు శుభారంభాన్ని ఇస్తే,  మనీష్‌ పాండే(31 నాటౌట్‌; 18 బంతుల్లో 4 ఫోర్లు), శార్దూల్‌ ఠాకూర్‌(22 నాటౌట్‌;8 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు) సమయోచితంగా ఆడారు. దాంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. శ్రీలంక టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ తీసుకోవడంతో టీమిండియా బ్యాటింగ్‌ ఆరంభించింది. భారత్‌ బ్యాటింగ్‌ను ధావన్‌-కేఎల్‌  రాహుల్‌లు ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ పోటీ పడి పరుగులు తీశారు. ఓ దశలో ధావన్‌ చెలరేగి ఆడాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తో బదులిచ్చాడు ధావన్‌.(ఇక్కడ చదవండి: సామ్సన్‌ చాలా మిస్సయ్యాడు..!)

కాగా, ధావన్‌ 52 వ్యక్తిగత పరుగుల వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.  సందకాన్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయి ధావన్‌ పెవిలియన్‌ చేరాడు. సుదీర్ఘ విరామం తర్వాత రెండో టీ20 ఆడుతున్న సంజూ సామ్సన్‌(6) నిరాశపరిచాడు. తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో విఫలమయ్యాడు. వచ్చీ రావడంతోనే తొలి బంతినే సిక్స్‌ కొట్టిన సామ్సన్‌ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. తన ఆడిన రెండో బంతికి ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. హసరంగా బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు.

ఇక రాహుల్‌ హాఫ్‌ సెంచరీ సాధించి మూడో వికెట్‌గా ఔట్‌ కాగా, కాసేపటికి అయ్యర్‌(4) సైతం విఫమయ్యాడు. సందకాన్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(26;17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్‌ అయ్యాడు. చివర్లో శార్దూల్‌ ఠాకూర్‌-మనీష్‌ పాండేల జోడి బ్యాట్‌ ఝుళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. వీరిద్దరూ  కలిసి చివరి ఓవర్‌లో 19 పరుగులు సాధించడంతో భారత స్కోరు రెండొందలు దాటింది.


కోహ్లి వరల్డ్‌ రికార్డు
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో వరల్డ్‌ రికార్డు సాధించాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యంత వేగవంతంగా 11వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న కెప్టెన్‌గా నూతన అధ్యాయాన్ని లిఖించాడు. శ్రీలంకతో మూడో టీ20కి ముందు ఈ ఫీట్‌ సాధించడానికి పరుగు దూరంలో నిలిచిన కోహ్లి దాన్ని చేరుకున్నాడు. కెప్టెన్‌గా 169 మ్యాచ్‌ల్లో కోహ్లి 11వేల అంతర్జాతీయ పరుగుల్ని సాధించాడు. మరొకవైపు భారత్‌ తరఫున ఈ ఫీట్‌ సాధించిన రెండో కెప్టెన్‌గా కోహ్లి నిలిచాడు.అంతకుముందు ఎంఎస్‌ ధోని కెప్టెన్‌గా 11వేలకు పైగా అంతర్జాతీయ పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు.

కెప్టెన్‌గా 11వేలు, అంతకంటే ఎక్కువ  అంతర్జాతీయ పరుగులు సాధించిన జాబితాలో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌(న్యూజిలాండ్‌), ఎంఎస్‌ ధోని(భారత్‌), అలెన్‌ బోర్డర్‌(ఆస్ట్రేలియా), గ్రేమ్‌ స్మిత్‌(దక్షిణాఫ్రికా), రికీ పాంటింగ్‌(ఆస్ట్రేలియా)లు ఉన్నారు.   పాంటింగ్‌ 324 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి15,440 పరుగులు చేయగా, గ్రేమ్‌ స్మిత్‌ 286 మ్యాచ్‌ల్లో 14, 878 పరుగులు చేశాడు. ఇక ఫ్లెమింగ్‌ 303 మ్యాచ్‌ల్లో 11, 561 పరుగులు చేయగా, ధోని 332 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి 11, 207 పరుగులు సాధించాడు.

సుదీర్ఘ విరామం తర్వాత ధావన్‌..
శిఖర్‌ ధావన్‌ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. కొన్నా‍ళ్లుగా ఒకవైపు గాయాలు, మరొకవైపు ఫామ్‌ లేమితో సతమవుతున్న ధావన్‌ బ్యాట్‌ విదిల్చాడు. శ్రీలంకతో జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో ధావన్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌ అర్థ శతకం నమోదు చేశాడు. ఇది ధావన్‌కు 15 టీ20 ఇన్నింగ్స్‌ల తర్వాత తొలి హాఫ్‌ సెంచరీ. 2018, నవంబర్‌ నెలలో చివరిసారి టీ20 హాఫ్‌ సెంచరీ సాధించిన తర్వాత ధావన్‌కు ఇదే తొలి అర్థ శతకం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top