టెస్టు చరిత్రలో టీమిండియా నయా రికార్డు

Ind Vs Ban: Team India Creates New Record After Innings Win - Sakshi

కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఈడెన్‌ వేదికగా జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో సైతం ఇన్నింగ్స్‌ను గెలుపును అందుకుంది. బంగ్లాదేశ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే పరిమితం చేసిన భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో విజయం​ సాధించింది. ఆదివారం మూడో రోజు ఆటలో బంగ్లాదేశ్‌ గంటలోపే ఇన్నింగ్స్‌ను ముగించింది. ఓవర్‌నైట్‌ ఆటగాళ్లు తైజుల్‌ ఇస్లామ్‌(11), ముష్పికర్‌ రహీమ్‌(74)లతో పాటు ఎబాదత్‌ హుస్సేన్‌(0)ను సైతం ఉమేశ్‌ యాదవ్‌ ఔట్‌ చేయడంతో బంగ్లాదేశ్‌ 184 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది.

ఈ రోజు ఆటలో బంగ్లాదేశ్‌ మరో 43 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో  ఉమేశ్‌ యాదవ్‌ ఐదు వికెట్లతో సత్తాచాటగా,  ఇషాంత్‌ శర్మ నాలుగు వికెట్లు సాధించాడు. బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మదుల్లా రిటైర్డ్‌ ఔట్‌ అయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన ఇషాంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా చెలరేగాడు. మొత్తంగా ఈ టెస్టులో  9 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఉమేశ్‌ యాదవ్‌ తొలి ఇన్నింగ్స్‌తో కలుపుకుని ఎనిమిది వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో  347/9  వద్ద డిక్లేర్డ్‌ చేయగా,  బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకు చాపచుట్టేసింది.

టీమిండియా నయా రికార్డు
ఈ టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ విజయం సాధించడంతో సరికొత్త రికార్డును నెలకొల్పింది. వరుసగా నాల్గో ఇన్నింగ్స్‌ విజయం సాధించి ఆ ఫీట్‌ను నమోదు చేసిన తొలి జట్టుగా నయా రికార్డు సృష్టించింది. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒక జట్టు ఇలా వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ విజయాలు సాధించడం ఇదే మొదటిసారి. అంతకుముందు భారత్‌ జట్టు.. బంగ్లాదేశ్‌ జరిగిన తొలి టెస్టును ఇన్నింగ్స్‌ తేడాతో గెలవగా, దక్షిణాఫ్రికాపై వరుస రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్‌ గెలుపులను అందుకుంది. ఫలితంగా విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా కొత్త అధ్యాయాన్ని లిఖించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top