ఆ ‘ఫాస్టెస్ట్‌’ రికార్డును మయాంక్‌ చేరతాడా?

Ind vs Ban: Mayank On The Cusp Of Equalling Don Bradman - Sakshi

కోల్‌కతా:  అంతర్జాతీయ క్రికెట్‌లో ఘనమైన ఆరంభంతో దూసుకుపోతున్న టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఇప్పుడు మరో రికార్డుపై కన్నేశాడు. గత ఏడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన మయాంక్‌ అగర్వాల్‌  ఎనిమిది టెస్టుల్లో 12 ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీల సాయంతో 858 పరుగులు చేశాడు. ఈ మూడు సెంచరీల్లో రెండింటిని డబుల్‌ సెంచరీలుగా మలుచుకుని ప్రత్యేక గుర్తింపు సంపాదిచుకున్నాడు. మయాంక్‌ టెస్టు సగటు 71.50గా ఉండగా, వెయి పరుగుల్ని సాధించడానికి 142 పరుగుల దూరంలో ఉన్నాడు. రేపు(శుక్రవారం) బంగ్లాదేశ్‌తో ఆరంభం కానున్న పింక్‌ బాల్‌ టెస్టులో మయాంక్‌ వెయ్యి పరుగుల్ని పూర్తి చేసుకుంటే అరుదైన జాబితాలో చేరిపోతాడు. ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు సర్‌ బ్రాడ్‌మన్‌ 13 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు సాధించగా, ఇప్పుడు మయాంక్‌ను కూడా అదే రికార్డు ఊరిస్తోంది.

టెస్టుల్లో వేగవంతంగా(ఇన్నింగ్స్‌లు పరంగా) వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో సట్‌క్లిఫీ(ఇంగ్లండ్‌), ఈడీ వీకెస్‌(వెస్టిండీస్‌) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ 12వ ఇన్నింగ్స్‌లోనే వెయ్యి పరుగుల్ని సాధించిన క్రికెటర్లు. ఆ తర్వాత స్థానంలో బ్రాడ్‌మన్‌ ఉన్నాడు. వినోద్‌ కాంబ్లీ(భారత్‌)-ఆర్‌ఎన్‌ హర్వే(ఆస్ట్రేలియా)లు 14 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగుల్ని పూర్తి చేసుకుని బ్రాడ్‌మన్‌ తర్వాత స్థానంలో ఉన్నారు. కాగా, బ్రాడ్‌మన్‌ సరసన నిలిచేందుకు మయాంక్‌కు అరుదైన అవకాశం ఉంది. మరి బ్రాడ్‌మన్‌ సరసన మయాంక్‌ చేరతాడో లేదో చూడాలి. గత బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన మయాంక్‌.. అంతకుముందు సఫారీలతో మ్యాచ్‌లో కూడా ద్విశతకం నమోదు చేశాడు. తద్వారా వేగవంతంగా రెండు డబుల్‌ సెంచరీలు సాధించి బ్రాడ్‌మన్‌ కంటే ముందుగానే ఈ ఫీట్‌ను సాధించాడు. బ్రాడ్‌మన్‌ తన కెరీర్‌లో 13 ఇన్నింగ్స్‌లు పూర్తి చేసుకునే సరికి రెండు డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top