మయాంక్‌ మళ్లీ బాదేశాడు..

Ind vs Ban: Mayank Century Drives Team India - Sakshi

ఇండోర్‌: తన టెస్టు కెరీర్‌లో ఆడుతున్నది ఎనిమిదో టెస్టు మ్యాచే అయినా టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ మరో సెంచరీతో మెరిశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భాగంగా శుక్రవారం రెండో రోజు ఆటలో మయాంక్‌ శతకం పూర్తి చేసుకున్నాడు. 183 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో సెంచరీ బాదేశాడు. ఇది మయాంక్‌కు మూడో టెస్టు సెంచరీ. 86/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఈరోజు ఆటను మయాంక్‌ అగర్వాల్‌-చతేశ్వర్‌ పుజారాలు ఆరంభించారు. ఈ క్రమంలోనే చతేశ్వర పుజారా(54) హాఫ్‌ సెంచరీ తర్వాత పెవిలియన్‌ చేరగా, మయాంక్‌ మాత్రం అర్థ శతకాన్ని సెంచరీగా మలుచుకున్నాడు.  పుజారా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(0) విఫలమయ్యాడు. తాను ఆడిన రెండో బంతికి డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. 

అటు తర్వాత అజింక్యా రహానేతో మయాంక్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇద్దరూ కుదురుగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించడంతో భారత్‌ తేరుకుంది. అంతకుముందు బంగ్లాదేశ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. తొలి రోజు టీ విరామం తర్వాత బంగ్లా ఇన్నింగ్స్‌ ముగియడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. కాగా, రోహిత్‌ శర్మ(6) నిరాశపరిచాడు. దాంతో పుజారా-మయాంక్‌ల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి రెండో వికెట్‌కు 91 పరుగులు జత చేశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top