అది గంగూలీతోనే ప్రారంభమైంది: కోహ్లి

Ind vs Ban: Learnt To Stand Up, Give It Back Kohli - Sakshi

కోల్‌కతా: భారత క్రికెట్‌ జట్టు వరుస విజయాలతో దుమ్మురేపుతూ ఉండటంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మంచి జోష్‌లో ఉన్నాడు. ఒకవైపు జట్టుగా రికార్డులు.. మరొకవైపు కెప్టెన్సీ రికార్డులు.. అదే సమయంలో వ్యక్తిగత రికార్డులు కోహ్లిలో రెట్టింపు ఉత్సాహాన్ని తీసుకొస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా మూడు రోజుల్లో ముగిసిన పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో కోహ్లి మాట్లాడాడు.

ఈ క్రమంలోనే బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ఇటీవల పగ్గాలు చేపట్టిన మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీకి కోహ్లి  ధన్యవాదాలు తెలిపాడు. అసలు భారత జట్టుకు దూకుడు నేర్పి విజయాలు బాట పట్టించింది గంగూలీనేనని, దాన్నే తాము కొనసాగిస్తున్నామన్నాడు. మ్యాచ్‌లను ఎలా జయించాలో గంగూలీనే పరిచయం చేశాడన్నాడు. గత మూడు-నాలుగేళ్ల నుంచి తాము జట్టుగా ఎంతో కృషి చేస్తూ ఉండటమే తాజా వరుస విజయాలకు కారణమన్నాడు. ఇక పింక్‌ బాల్‌ టెస్టుకు వచ్చిన ప్రేక్షకుల గురించి కోహ్లి తనదైన శైలిలో మాట్లాడాడు.

తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువ మంది మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చారని, ఇక మూడో రోజు ఆటకు కూడా ఎక్కడా అభిమానులు తగ్గలేదన్నాడు. మ్యాచ్‌ రెండో రోజుకే దాదాపు పూర్తి కావడంతో మూడో రోజు ఇంత మంది ప్రేక్షకులు వస్తారని ఊహించ లేదన్నాడు. వేల సంఖ్యలో వచ్చిన అభిమానుల సాక్షిగా భారత్‌ సాధించిన విజయానికి ఈ స్టేడియమే ప్రత్యేక వేదికైందన్నాడు. టెస్టు మ్యాచ్‌ల కోసం పరిమితమైన సంఖ్యలో స్టేడియాలు ఉంటే సరిపోద్ది అని తాను సూచించడానికి ఇదొక కారణమని కోహ్లి పేర్కొన్నాడు.  

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌  46 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 130 పరుగుల  తేడాతో గెలిచిన టీమిండియా.. అదే ప్రదర్శనను పింక్‌ బాల్‌ టెస్టులో కూడా పునరావృతం చేసి ఘన విజయాన్ని అందుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top