అటు ఇషాంత్‌.. ఇటు పుజారా.. ఆపై కోహ్లి

Ind vs Ban: Ishant, Pujara And Put India In Command - Sakshi

కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 46 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌(14) తొలి వికెట్‌గా ఔటైతే, రోహిత్‌ శర్మ(21) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.  దాంతో భారత జట్టు 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో చతేశ్వర పుజారా-విరాట్‌ కోహ్లి జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 94 పరుగులు జోడించిన తర్వాత పుజారా(55; 105 బంతుల్లో 8 ఫోర్లు) ఔటయ్యాడు. ఎబాదత్‌ వేసిన 40 ఓవర్‌ తొలి బంతిని అంచనా వేయడంలో విఫలమైన పుజారా.. షాద్‌మన్‌ ఇస్లామ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కాగా, పింక్‌ బాల్‌ టెస్టులో హాఫ్‌ సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. అటు తర్వాత కోహ్లి కూడా హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆట ముగిసే సమయానికి కోహ్లి(59 బ్యాటింగ్‌; 93 బంతుల్లో 8 ఫోర్లు), రహానే( 23 బ్యాటింగ్‌; 22 బంతుల్లో 3 ఫోర్లు)లు క్రీజ్‌లో ఉన్నారు.  భారత్‌ కోల్పోయిన మూడు వికెట్లలో ఎబాదత్‌ రెండు వికెట్లు తీయగా, అల్‌ అమిన్‌ హుస్సేన్‌కు వికెట్‌ దక్కింది.

అంతకుముందు ఇషాంత్‌ శర్మ ఐదు వికెట్లతో బంగ్లాను హడలెత్తించాడు. దాంతో పింక్‌ బాల్‌ టెస్టులో ఐదు వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా ఇషాంత్‌ నిలిచాడు. ఫలితంగా భారత్‌-బంగ్లాల పింక్‌ బాల్‌ టెస్టులో అటు ఐదు వికెట్లు, ఇటు హాఫ్‌ సెంచరీ కూడా భారత ఆటగాళ్ల పేరిటే లిఖించబడ్డాయి. ఒకవేళ కోహ్లి హాఫ్‌ సెంచరీని సెంచరీగా మలచుకుంటే చారిత్రక పింక్‌ బాల్‌ టెస్టులో ఆ ఘనత సాధించిన మొదటి భారత క్రికెటర్‌గా నిలుస్తాడు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే చాపచుట్టేసింది. భారత్‌ పేసర్లు చెలరేగిపోవడంతో బంగ్లాదేశ్‌ వంద పరుగుల మార్కును అతి కష్టం మీద చేరింది. ప్రధానంగా ఇషాంత్‌ శర్మ ఐదు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా, ఉమేశ్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించాడు. మహ్మద్‌ షమీకి రెండు వికెట్లు లభించాయి.  ఇషాంత్‌ వేసిన ఫుల్‌ లెంగ్త్‌, స్వింగ్‌ బంతులకు బంగ్లా బ్యాట్స్‌మెన్‌ బెంబేలెత్తిపోయారు. బంగ్లా ఆటగాళ్లలో షాద్‌మన్‌ ఇస్లామ్‌(29), లిటాన్‌ దాస్‌(24 రిటైర్డ్‌ హర్ట్‌), నయీమ్‌ హసన్‌(19)లు మాత్రమే రెండంకెల స్కోరును చేయగా ఆ జట్టు 30.3 ఓవర్లలో ఇన్నింగ్స్‌ను ముగించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top