భారత్‌ను భారీ విజయం ఊరిస్తోంది..

Ind vs Ban: Ishant Help Team India Take Control In Pink Ball Test - Sakshi

కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసేందుకు టీమిండియా ఇంకా నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది. బంగ్లాతో పింక్‌ బాల్‌ టెస్టులో భాగంగా శనివారం రెండో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌ వరుస విరామాల్లో కోల్పోయి ఎదురీదుతోంది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ ఆరు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఈరోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా బంగ్లాదేశ్‌ ఆరో వికెట్‌ను చేజార్చుకుంది. ఆరో వికెట్‌గా తైజుల్‌ ఇస్లామ్‌(11) ఔటైన తర్వాత రెండో రోజు ఆటను ముగించారు. ఇంకా బంగ్లాదేశ్‌ 89 పరుగులు వెనుకబడి ఉండటంతో భారత్‌కు మరో ఇన్నింగ్స్‌ విజయం ఖాయంగానే కనబడుతోంది. ముష్పికర్‌(59 బ్యాటింగ్‌: 70 బంతుల్లో 10 ఫోర్లు) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.

మహ్మదుల్లా, మెహిదీ హసన్‌లతో కలిసి మంచి భాగస్వామ్యాలను నెలకొల్పిన ముష్పికర్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. భారత్‌పై మంచి రికార్డు ఉన్న ముష్పికర్‌ అదే ఆటను కొనసాగించాడు. కాకపోతే అతనికి మిగతా వారి నుంచి ఆశించిన సహకారం అందలేదు.  ముష్పికర్‌-మహ్మదుల్లాలు క్రీజ్‌లో కుదురుకున్న సమయంలో బంగ్లాకు షాక్‌ తగిలింది. మహ్మదుల్లా తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్ట్‌ హర్ట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో మెహిదీ హసన్‌ కాసేపు భారత బౌలర్లను ప్రతిఘటించినా ఎక్కవ సేపు క్రీజ్‌లో నిలవలేదు. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైన బంగ్లాదేశ్‌..  రెండో ఇన్నింగ్స్‌లో అదే పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించగా తొమ్మిది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బంగ్లాదేశ్‌ ఇలా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కాసేపటికే రెండు వికెట్లను కోల్పోయింది. ఇషాంత్‌ శర్మ నిప్పులు చెరిగే బంతులతో తొలి రెండు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు.  ఓపెనర్‌ షాద్‌మన్‌ ఇస్లామ్‌, మోమినుల్‌ హక్‌లను డకౌట్లగా పెవిలియన్‌కు పంపాడు. ఇషాంత్‌ వేసే బంతుల్ని ఎదుర్కోవడానికి బెంబేలెత్తిన వీరిద్దరూ చివరకు వికెట్లు సమర్పించుకున్నారు.

ఆ తర్వాత మహ్మద్‌ మిథున్‌(6)ను ఉమేశ్‌ యాదవ్‌ ఔట్‌ చేశాడు. ఆపై స్వల్ప వ్యవధిలో ఇమ్రుల్‌ కేయిస్‌(5)ను ఇషాంత్‌ ఔట్‌ చేయడంతో బంగ్లాదేశ్‌ 13 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇషాంత్‌ వేసిన ఏడో ఓవర్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చిన ఇమ్రుల్‌ పెవిలియన్‌ చేరాడు.  బంగ్లాదేశ్‌ కోల్పోయిన ఆరు వికెట్లలో నాలుగు వికెట్లను ఇషాంత్‌ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్‌ ఐదు వికెట్లతో సత్తాచాటిన సంగతి తెలిసిందే. భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 347/9  వద్ద డిక్లేర్డ్‌ చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top