‘పాక్‌లో ముప్పు ఉంటే నేను రాను కదా’

Holding Bats For More Cricket In Pakistan After Visit Afridis Home - Sakshi

కరాచీ: పాకిస్తాన్‌లో సరైన భద్రత లేదనే కారణం చూపుతూ పలు దేశాల క్రికెటర్లు ఇక్కడకి రావడానికి భయపడుతున్నారు. ఇటీవల శ్రీలంక క్రికెట్‌ జట్టు.. పాకిస్తాన్‌ పర్యటనకు వచ్చినా పూర్తిస్థాయి జట్టు రాలేదు. లసిత్‌ మలింగా, దిముత్‌ కరుణరత్నేతో సహా ఎక్కువ సంఖ్యలో పాక్‌ పర్యటనకు రావడానికి ఇష్టపడలేదు. భద్రతా పరమైన కారణంగా పాకిస్తాన్‌కు రాలేమని తేల్చిచెప్పేశారు.  దాంతో ‘జూనియర్‌ శ్రీలంక జట్టు’ పాక్‌ పర్యటనకు వచ్చింది. అయితే తాజాగా వెస్టిండీస్‌ బౌలింగ్‌ దిగ్గజం మైకేల్‌ హోల్డింగ్‌ పాకిస్తాన్‌లో అడుగుపెట్టారు.

అదే సమయంలో మైకేల్‌ హోల్డింగ్‌కు తన నివాసంలో పాక్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది అతిథి మర్యాదాలు చేశాడు. అఫ్రిదితో పాటు పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ సయ్యద్‌ అన్వర్‌ కూడా అఫ్రిది ఇచ్చిన విందును స్వీకరించారు. అనంతరం హోల్డింగ్‌ మాట్లాడుతూ.. ‘ ఏ విధమైన భద్రత పరమైన లోపాలున్నా నేను పాకిస్తాన్‌కు రాలేను కదా. పాకిస్తాన్‌లో ఎటువంటి ముప్పు లేదు. నాకైతే ఎటువంటి సమస్య తలెత్తలేదు. శ్రీలంక క్రికెట్‌ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించడం ఇక్కడ క్రికెట్‌కు పూర్వవైభవాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది’ అని అన్నారు.

హోల్డింగ్‌ తన ఇంటికి రావడంపై అఫ్రిది స్పందిస్తూ.. ‘ ఒక దిగ్గజ ఆటగాడు నేను ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నా. హోల్డింగ్‌ పాక్‌ రావడానికి డాక్టర్‌ ఖాషిఫ్‌ కృషి చేశారు. ఆయనకు కూడా ధన్యవాదాలు. దాంతో పాటు అన్వర్‌ కూడా నేను ఏర్పాటు చేసిన డిన్నర్‌కు వచ్చాడు. ఇద్దరు క్రికెట్‌ దిగ్గజాలు ఇలా రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది’ అని అఫ్రిది ట్వీట్‌ చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top