
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ) భారత జట్ల కోచ్‌లను పరస్పరం మార్చేసింది. మహిళల కోచ్ హరేంద్ర సింగ్‌ను పురుషుల జట్టుకు నియమించగా, పురుషుల కోచ్ జోయర్డ్ మరీనేకు మళ్లీ మహిళల బాధ్యతలు అప్పగించింది. గతంలో మరీనే మహిళల జట్టుకు శిక్షణ ఇచ్చారు. గోల్డ్ కోస్ట్‌లో ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పురుషుల జట్టు పతకం గెలవడంలో విఫలం కావడంతో హెచ్‌ఐ ఈ నిర్ణయం తీసుకుంది. మరీనే శిక్షణలో నిరాశపరిచిన మన్‌ప్రీత్ సేన ఐదో స్థానంలో నిలిచింది. 2006 కామన్వెల్త్ తర్వాత పతకం లేకుండా రావడం ఇదే మొదటిసారి. మరోవైపు మహిళల జట్టు కూడా పతకం గెలవకపోయినా... నాలుగో స్థానం పొందింది. అయితే హరేంద్రకు పురుషుల జట్టును విజయవంతంగా నడిపించిన అనుభవముంది.
2009 నుంచి 2011 వరకు ఆయన కోచ్‌గా సేవలందించారు. రెండేళ్ల క్రితం 2016లో జూనియర్ ప్రపంచకప్‌లో భారత యువ జట్టు టైటిల్ గెలవడంతో కీలకపాత్ర పోషించారు. ఆయన మార్గదర్శనంలోనే గతేడాది జపాన్‌లో జరిగిన ఆసియా కప్‌లో మహిళల జట్టు విజేతగా నిలిచింది. మహిళల జట్టుతో తన పయనం సానుకూలంగా సాగిందని ఇప్పుడు పురుషుల జట్టు బాధ్యతలు అప్పగించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు హరేంద్ర చెప్పారు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో ఉన్న మరీనే తిరిగి మహిళల జట్టుకు రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచకప్‌కు జట్టును సన్నద్ధం చేస్తానని తెలిపారు.