
న్యూఢిల్లీ:భారత సీనియర్ పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్ పదవి నుంచి హరేంద్ర సింగ్‌ను తప్పించారు. సొంతగడ్డపై జరిగిన ప్రపంచ కప్‌లో భారత జట్టు సెమీఫైనల్ చేరడంలో విఫలం కావడమే అందుకు కారణం. హరేంద్ర స్థానంలో కొత్త కోచ్ ఎంపిక కోసం హాకీ ఇండియా దరఖాస్తులు కూడా కోరింది. వరల్డ్ కప్‌లో గ్రూప్ దశలో టాపర్‌గా నిలిచిన భారత్... క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఓడింది.
మ్యాచ్‌లో పరాజయం అనంతరం మేం 13 మందితో తలపడ్డామంటూ రిఫరీలకు వ్యతిరేకంగా హరేంద్ర చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 2018 మే నుంచి హరేంద్ర కోచ్‌గా వ్యవహరించారు. గత పాతికేళ్లలో హాకీ సమాఖ్య తప్పించిన 25వ కోచ్ హరేంద్ర కావడం విశేషం. అయితే హరేంద్రను గతంలో పని చేసిన విధంగా జూనియర్ హాకీ జట్టు బాధ్యతలు అప్పగించారు.