నిరవధిక బహిష్కరణ

Hardik Pandya, KL Rahul suspended, to miss ODI series against Australia and New Zealand - Sakshi

హార్దిక్‌ పాండ్యా, రాహుల్‌లపై వేటు వేసిన బీసీసీఐ

విచారణ ముగిసే వరకు మ్యాచ్‌లు, బోర్డు కార్యక్రమాల్లో పాల్గొనడంపై నిషేధం

సిడ్నీ: టీవీ టాక్‌ ‘షో’లో మహిళల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, లోకేశ్‌ రాహుల్‌లపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) చర్యలు తీసుకుంది. వారిద్దరిపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఎంత కాలం లేదా ఎన్ని మ్యాచ్‌లు అనే విషయం ప్రకటించకపోయినా ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌ పర్యటనకు కూడా వీరిద్దరు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. పాండ్యా, రాహుల్‌లపై విచారణ కొనసాగుతుండగానే సస్పెండ్‌ చేయడం విశేషం. వీరిద్దరికి బోర్డు తాజాగా మళ్లీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఇద్దరిపై చర్యలు ఎందుకు తీసుకోరాదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. సీఓఏ ఈ–మెయిల్‌ ద్వారా ఈ సమాచారం అందించింది.

‘అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణారాహిత్యం ప్రదర్శించినందుకు బీసీసీఐ నియమావళిలోని నిబంధన–41 కింద విచారణ జరుగుతోందనే విషయం మీకు తెలుసు. ప్రస్తుతం ఆ విచారణ పెండింగ్‌లో ఉంది. 41 (6) నిబంధనను అనుసరించి మీపై తక్షణం నిషేధం విధిస్తున్నాం. దీని ప్రకారం విచారణ ముగిసి తుది తీర్పు వచ్చే వరకు బీసీసీఐ లేదా ఐసీసీ లేదా రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు సంబంధించిన గుర్తింపు పొందిన ఏదైనా మ్యాచ్‌లో పాల్గొనడం లేదా కార్యక్రమాలకు హాజరు కావడం కూడా మీరు చేయరాదు’ అని బోర్డు స్పష్టం చేసింది. సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరితో చర్చించిన తర్వాత నిషేధంపై నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి రానున్న పాండ్యా, రాహుల్‌ స్థానాల్లో ఇద్దరు కొత్త ఆటగాళ్లను సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేయనుంది. 

‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమంలో పాండ్యా, రాహుల్‌ అమ్మాయిల గురించి అసభ్యంగా మాట్లాడటంతో తీవ్ర వివాదం చెలరేగింది. కుర్రాళ్లకు ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలా వ్యవహరించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. బీసీసీఐ షోకాజ్‌ నోటీసుకు స్పందిస్తూ వారిద్దరు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే దీనితో సరిపెట్టకుండా కనీసం రెండు వన్డేల నిషేధం విధించాలని సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ సూచించడంతో శిక్ష తీవ్రత పెరిగింది. నేడు జరిగే తొలి వన్డే కోసం వీరిద్దరి పేర్లను పరిశీలించరాదని టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు బోర్డు నుంచి ముందే సమాచారం అందడంతో వారిని పక్కన పెట్టారు. మరోవైపు తమ ‘షో’ కొందరి మనోభావాలను గాయపరిచినట్లు గుర్తిస్తూ దీనిని తొలగిస్తున్నట్లు హాట్‌స్టార్‌ ప్రకటించింది. 

వాళ్లు తప్పు చేశారు
అనుచిత వ్యాఖ్యల విషయంలో భారత జట్టు నుంచి మా ఇద్దరు ఆటగాళ్లకు ఎలాంటి మద్దతు లభించదు. ఈ విషయాన్ని పాండ్యా, రాహుల్‌కు కూడా చెప్పేశాం. అవి వ్యక్తిగత వ్యాఖ్యలే అయినా వాటిని మేం అంగీకరించడం లేదు. ఆ ఇద్దరు ఆటగాళ్లకు కూడా తాము ఎంత పెద్ద తప్పు చేశామో అర్థమైంది. వారిపై దీని ప్రభావం పడింది. ఇలా జరగడం దురదృష్టకరం. కానీ కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. ఇకపై ఏం జరుగబోతోందో చూడటమే మనం చేయగలం. ఇలాంటి సమయంలో జట్టు కూర్పు గురించి మాత్రం మళ్లీ ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ఈ అంశాలు మా జట్టు స్ఫూర్తిని దెబ్బ తీయలేవు. ఇంతకు ముందే చెప్పినట్లు అవి పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయాలు. మేం వాటిని ఖండిస్తున్నాం.                        
– కోహ్లి, భారత కెప్టెన్‌   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top