కామన్వెల్త్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌కు చేదు అనుభవం

Gold Medallist Poonam Yadav Attacked In Varanasi - Sakshi

ఇటుకలు, రాళ్లతో గుర్తు తెలియని వ్యక్తుల దాడి

వారణాసి: కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచి భారత కీర్తిని  పతాక స్థాయికి చేర్చిన వెయిట్‌లిఫ్టర్ పూనమ్ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. శనివారం వారణాసిలో ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. పూనమ్‌ యాదవ్‌ వారణాసిలోని తమ బంధువుల ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. పూనమ్‌తోపాటు తండ్రి, మరో ఇద్దరు బంధువులు కూడా ఉన్నారు. వాళ్లు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. దుండగులు వారిపైన కూడా దాడి చేశారు. రాళ్ల వర్షం కురవడంతో పోలీసులు వెంటనే పూనమ్‌ను అక్కడి నుంచి తరలించారు. 

ఈ ఘటనపై వారణాసి రూరల్ ఎస్పీ అమిత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ విషయం తెలియగానే అదనపు బందోబస్తును పూనమ్‌ యాదవక్‌కు రక్షణగా పంపించామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దాడికి పాల్పడిన వాళ్లను వదిలిపెట్టమన్నారు. గతంలో పూనమ్ యాదవ్ బంధువు, సమీప గ్రామ పెద్దకు మధ్య ఉన్న భూవివాదంలో భాగంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన 21వ కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ మహిళల 69 కేజీల విభాగంలో పూనమ్ గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. స్నాచ్‌లో 100 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 122 కేజీల బరువెత్తి ఆమె పసిడిని సొంతం చేసుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top