ఆఖరి సంగ్రామం

ఆఖరి సంగ్రామం - Sakshi


ప్రతీకారం కోసం అర్జెంటీనా  

 చరిత్ర కోసం జర్మనీ

 

 జీవితంలో ఒక్కసారైనా ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలని ప్రతి ఫుట్‌బాల్ క్రీడాకారుడు కలలు కంటాడు. ఆ రోజు రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో ఒకరికి మోదం.... మరొకరికి ఖేదం కలగడానికి రంగం సిద్ధమైంది. 2014 ప్రపంచకప్ ఆఖరి సంగ్రామానికి రియో డి జనీరోలోని విఖ్యాత మరకానా స్టేడియం వేదికగా నిలువనుంది.

 

 దక్షిణ అమెరికా గడ్డపై విశ్వవిజేతగా నిలిచిన తొలి యూరోప్ జట్టుగా చరిత్ర సృష్టించేందుకు జర్మనీ... చివరి మూడుసార్లు ప్రపంచకప్‌లో ఏదో ఒక దశలో తమ అవకాశాలకు గండికొట్టిన జర్మనీని ఓడించి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో అర్జెంటీనా... ఆదివారం జరిగే అంతిమ సమరానికి సిద్ధమయ్యాయి.

 

 రియో డి జనీరో: అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ జర్మనీ... చాపకింద నీరులా ఎవరూ ఊహించని ఆటతీరుతో అర్జెంటీనా... ప్రపంచకప్‌లో తమ అంతిమ లక్ష్యానికి చేరువయ్యాయి. ఏకవ్యక్తిపై ఆధారపడకుండా కలిసికట్టుగా ఆడుతూ జర్మనీ ఈ టోర్నీలో అద్భుత ఫామ్‌లో ఉంది.

 

 థామస్ ముల్లర్, మిరోస్లావ్ క్లోజ్, షుర్లె, ఒజిల్, సమీ ఖెదిరా, ష్వాన్‌స్టీగర్, హమెల్స్, టోనీ క్రూస్, మారియో గోట్జీ తదితర ఆటగాళ్లతో జర్మనీ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. గోల్‌కీపర్ మాన్యుయెల్ నెయర్ కూడా అడ్డుగోడ పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జర్మనీయే టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. బ్రెజిల్‌తో సెమీఫైనల్లో ఆడిన తుది జట్టే ఫైనల్లోనూ ఆడే అవకాశముంది.

 

 మరోవైపు లియోనెల్ మెస్సీ మెరుపులపైనే అర్జెంటీనా ఆధారపడుతోంది. ఆరంభంలో జర్మనీని గోల్ చేయకుండా నిలువరించడమే అర్జెంటీనా ప్రథమ లక్ష్యమనిపిస్తోంది. లీగ్ దశలో ఘనా, అమెరికా జట్లు జర్మనీని తొలి అర్ధభాగంలో గోల్ చేయకుండా నిలువరించాయి. ప్రిక్వార్టర్ ఫైనల్లోనైతే అల్జీరియా 90 నిమిషాలు జర్మనీని గోల్ చేయకుండా ఆపింది. అర్జెంటీనా కూడా పక్కా ప్రణాళికతో ఆడితే జర్మనీ జోరుకు అడ్డకట్ట వేయడం సాధ్యమే. గాయాల బారిన పడ్డ డి మారియో, అగుయెరో కోలుకోవడం అర్జెంటీనాకు ఊరటనిచ్చే అంశం. మెస్సీతో కలిసి ఈ ఇద్దరు జర్మనీ గోల్‌పోస్ట్‌పై దాడులు చేసే అవకాశముంది.

 

 బలం

 Strength

 

 సమష్టి కృషి, సమన్వయం పదాలకు ఈ జట్టు ప్రతిరూపం. ఈ టోర్నీలో ఏ దశలోనూ జర్మనీ వ్యక్తిగతంగా ఒకే ఆటగాడిపై ఆధారపడిన దాఖలాలు కనిపించలేదు. అర్జెంటీనా అంటే మెస్సీ, పోర్చుగల్ అంటే క్రిస్టియానో రొనాల్డో, బ్రెజిల్ అంటే నెయ్‌మార్... కానీ జర్మనీ అంటే ఒక జట్టు అనే ట్వీట్ సామాజిక సైట్‌లలో విశేషంగా ఆకట్టుకుంటోంది.

 

 అర్జెంటీనాకు కర్త, కర్మ, క్రియ అన్నీ మెస్సీనే. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో మెస్సీకే నాలుగుసార్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు దక్కడం అతనికున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ఈ ప్రపంచకప్‌లో మెస్సీ తన సహచరులకు 21 సార్లు గోల్ చేసే అవకాశాలను సృష్టించాడు.

 

 బలహీనత

 Weakness

 

 ఎవరూ ఊహించనివిధంగా ఒక్కసారిగా తడబడటం ఆందోళన కలిగించే అంశం. ఘనాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో తొమ్మిది నిమిషాల వ్యవధిలో జర్మనీ రెండు గోల్స్ సమర్పించుకొని వెనుకబడింది. పోర్చుగల్, ఫ్రాన్స్ జట్లు మినహా మిగతా నాలుగు జట్లు జర్మనీపై గోల్స్ చేయడం ఆ జట్టు డిఫెన్స్ దుర్బేధ్యం కాదనే విషయం రుజువు చేస్తోంది.

 

 మెస్సీపైనే పూర్తిగా ఆధారపడటం. ఒకవేళ మెస్సీకి మ్యాచ్ మధ్యలో గాయమైతే అతని స్థానాన్ని భర్తీచేసే వాళ్లు కనిపించడంలేదు. ప్రపంచకప్‌లో ప్రత్యర్థి జర్మనీపై ఉన్న రికార్డు బాగోలేదు. ప్రపంచకప్ మ్యాచ్‌లో జర్మనీని ఓడించి అర్జెంటీనాకు 28 ఏళ్లయింది.

 

 అవకాశం

 Opportunity



 84 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో అమెరికా గడ్డపై ఇప్పటిదాకా ఏ యూరోప్ జట్టు టైటిల్ సాధించలేదు. 1962 (చిలీ)లో చెకోస్లొవేకియా; 1970 (మెక్సికో)లో ఇటలీ; 1986 (మెక్సికో)లో పశ్చిమ జర్మనీ; 1994 (అమెరికా)లో ఇటలీ రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నాయి. ఐదో ప్రయత్నంలోనైనా జర్మనీ ఈ అడ్డంకిని అధిగమిస్తుందో లేదో వేచి చూడాలి.

 

 

 అమెరికా గడ్డపై ఇప్పటివరకు ఆరు ప్రపంచకప్‌లు (1930 ఉరుగ్వే; 1950 బ్రెజిల్; 1962 చిలీ; 1970, 1986 మెక్సికో; 1994 అమెరికా) జరిగాయి. ఆరింట్లోనూ దక్షిణ అమెరికా జట్లకే టైటిల్ లభించింది. ఒకవేళ అర్జెంటీనా నెగ్గితే ఏడోసారీ దక్షిణ అమెరికా జట్టు ఖాతాలోనే టైటిల్ చేరుతుంది.

 

 ముప్పు

 Threat

 

 సెమీఫైనల్ లేదా ఫైనల్‌కు చేరుకోవడం,  చివరి మెట్టుపై బోల్తా పడటం జర్మనీకి అలవాటుగా మారింది. గతంలో నాలుగుసార్లు ఫైనల్లో; నాలుగుసార్లు సెమీఫైనల్లో జర్మనీ ఓడిపోయింది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుంటే జర్మనీకి గత చరిత్ర అనుకూలంగా లేదనే విషయం సూచిస్తోంది.

 

 24 ఏళ్లుగా టైటిల్ కోసం వేచి చూస్తున్న జర్మనీ ఈ అవకాశాన్ని వదులుకునే ప్రసక్తేలేదు. మెస్సీని ఎలా కట్టడి చేయాలో ఇప్పటికే జర్మనీ ‘పక్కా స్కెచ్’ గీసింది. జర్మనీ ఆరంభంలోనే గోల్ చేసి ఒత్తిడి పెంచితే కష్టం.

 

 విశేషాలు

 అర్జెంటీనా, జర్మనీ జట్ల మధ్య ఇది మూడో ప్రపంచకప్ ఫైనల్. ఇప్పటిదాకా ఏ రెండు జట్లు మూడుసార్లు ప్రపంచకప్ టైటిల్‌పోరులో తలపడలేదు.

 

 1986 ఫైనల్లో అర్జెంటీనా 3-2తో జర్మనీని ఓడించగా... 1990 ఫైనల్లో జర్మనీ 1-0తో అర్జెంటీనాపై గెలిచింది.

 

1986 ప్రపంచకప్ ఫైనల్లో విజయం తర్వాత ఇప్పటిదాకా అర్జెంటీనా ప్రపంచకప్ మ్యాచ్‌లో జర్మనీని ఓడించలేదు. 2006 క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా ‘పెనాల్టీ షూటౌట్’లో 2-4తో; 2010 క్వార్టర్ ఫైనల్లో 0-4తో జర్మనీ చేతిలోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. వరుసగా మూడు ప్రపంచకప్‌లలో నాకౌట్ దశలో ఒకే జట్టు చేతిలో ఓ జట్టు ఓడిపోలేదు.

 

 ఏ జట్టుకూ సాధ్యంకాని విధంగా జర్మనీ ఎనిమిదోసారి ప్రపంచకప్ ఫైనల్లో ఆడుతోంది.

 

 ఈసారి జర్మనీ గెలిస్తే నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచి ఇటలీ సరసన నిలుస్తుంది. బ్రెజిల్ అత్యధికంగా ఐదుసార్లు ప్రపంచకప్ సాధించింది.

 

 త్యధికంగా నాలుగుసార్లు ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయిన జట్టుగా జర్మనీకి గుర్తింపు ఉంది. కానీ చివరి 17 మ్యాచ్‌ల్లో జర్మనీకి ఓటమి ఎదురుకాలేదు.

 

 నాకౌట్ దశలో మూడు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా నిర్ణీత సమయంలో ప్రత్యర్థికి గోల్ ఇవ్వలేదు.

 

 చివరి మూడు మ్యాచ్‌ల్లో మెస్సీ ఒక్క గోల్ (షూటౌట్ మినహాయింపు) కూడా చేయలేదు. 2011లో అలెజాంద్రో సాబెల్లా కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మెస్సీ ఇప్పటివరకు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గోల్ చేయకుండా ఉండటం జరుగలేదు.

 

 అర్జెంటీనా జట్టు సగటు వయసు 29. ఒకవేళ అర్జెంటీనా గెలిస్తే పెద్ద వయస్సు హోదాలో టైటిల్ నెగ్గిన జట్టుగా రికార్డు నెలకొల్పిన ఇటలీ (2006లో) స్థానాన్ని ఆక్రమిస్తుంది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top