అదే నా బలం: క్రిస్‌ గేల్‌

Gayle focused on mental game ahead of World Cup - Sakshi

ఆంటిగ్వా: తన ఫిట్‌నెస్‌పై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని వెస్టిండీస్‌ స్టార్‌ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తన బ్యాటింగ్‌పై చాలా సంతృప్తిగా ఉన‍్నానని గేల్‌ పేర్కొన్నాడు. గత కొన్ని నెలలుగా తాను ఫిట్‌నెస్‌ గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా అది తన ఆటపై పెద్దగా ప్రభావం చూపదన్నాడు. తన అనుభవంతో పాటు మానసికంగా దృఢంగా ఉండటమే పరుగులు సాధించడానికి దోహద పడుతుందన్నాడు. ‘ నా అనుభవం, మానసిక దృఢత్వమే నా బలం. నేను చాలా రోజులుగా జిమ్‌కు కూడా వెళ్లడం లేదు. కొన్ని నెలలుగా ఫిట్‌నెస్‌పై జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. అయినా నాకు ఇబ్బంది లేదు. నేను ఎక్కువ విశ్రాంతి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాను. ఫిట్‌నెస్‌ కంటే కూడా యోగాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. కాబట్టి శారీరక సమస్యలు నన్నంతగా వేధించవు’ అని గేల్‌ పేర్కొన్నాడు.

మే 30వ తేదీ నుంచి వరల్డ్‌కప్‌ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌ వైస్‌ కెప్టెన్‌గా గేల్‌ పోరుకు సిద్ధమవుతున్నాడు. ఇది గేల్‌కు ఐదో వరల్డ్‌కప్‌. ఇదే అతడి చివరి ప్రపంచకప్‌ కావచ్చు.  ఇటీవలి కాలంలో వన్డే సిరీస్‌లో గేల్‌ సూపర్‌ ఫామ్‌ కనబరిచాడు. ప్రధానంగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా నాలుగు ఇన్నింగ్స్‌లో 106 సగటుతో 429 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండటం విశేషం. మరొకవైపు ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో గేల్‌ 13 మ్యాచ్‌లు ఆడి 490 పరుగులు చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top