
మృత్యుక్రీడ
ఫిల్ హ్యూస్‌కు ముందు కూడా పలువురు ఆటగాళ్లు మైదానంలో గాయపడి ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ దేశవాళీ క్రికెట్‌లోనే జరిగాయి.
ఫిల్ హ్యూస్‌కు ముందు కూడా పలువురు ఆటగాళ్లు మైదానంలో గాయపడి ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ దేశవాళీ క్రికెట్‌లోనే జరిగాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆటగాళ్లు తీవ్రంగా గాయపడిన సందర్భాలు ఉన్నా ఎవరూ చనిపోలేదు. క్రికెట్ ఆడుతూ చనిపోయిన వారు...
రమణ్ లాంబా (38 ఏళ్లు- భారత్): 1998లో బంగ్లాదేశ్‌లో లీగ్ ఆడుతూ ఫార్వర్డ్ షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తూ బ్యాట్స్‌మన్ కొట్టిన షాట్‌కు బలయ్యాడు.
అబ్దుల్ అజీజ్ (17 ఏళ్లు -పాక్): 1959లో దేశవాళీ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా బంతి ఛాతీకి గట్టిగా తగలడంతో మృతి
డరైన్ రాండల్ (32 ఏళ్లు - దక్షిణాఫ్రికా): స్థానిక ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో పుల్ షాట్ ఆడబోయి తలపై గాయం కావడంతో గత ఏడాది చనిపోయాడు.
ఇయాన్ ఫాలీ (30 ఏళ్లు - ఇంగ్లండ్): 1993లో వైట్‌హావెన్ జట్టు తరఫున బ్యాటింగ్ చేస్తుండగా కంటి వద్ద పెద్ద దెబ్బ తగిలింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో మరణించాడు.
జుల్ఫిఖర్ భట్టీ (22 ఏళ్లు -పాక్): ఏడాది క్రితం లీగ్ మ్యాచ్‌లో పుల్ షాట్ ఆడగా, ఛాతీకి బలమైన దెబ్బ తగిలింది. ఆస్పత్రికి చేర్చే లోపే కన్ను మూశాడు.
జార్జ్ సమ్మర్స్ (25 ఏళ్లు - ఇంగ్లండ్): 1870లో లార్డ్స్‌లో ఆడుతుండగా ఒక షార్ట్ బంతి బలంగా తాకినా...అంతా బాగుందంటూ ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. అయితే అదే గాయంతో నాలుగు రోజుల తర్వాత జార్జ్ మరణించాడు.
- సాక్షి క్రీడావిభాగం