క్వార్టర్స్‌లో అర్జెంటీనా | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో అర్జెంటీనా

Published Fri, Dec 7 2018 5:02 AM

France stuns Argentina 5-3 - Sakshi

భువనేశ్వర్‌: రియో ఒలింపిక్‌ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ అర్జెంటీనా హాకీ ప్రపంచకప్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. పూల్‌ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో అర్జెంటీనా 3–5 గోల్స్‌ తేడాతో 20వ ర్యాంకర్‌ ఫ్రాన్స్‌ చేతిలో ఓడినా పట్టికలో అగ్రస్థానంలో నిలవడంతో నేరుగా క్వార్టర్స్‌ చేరింది. ఈ మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన ఫ్రాన్స్‌ క్రాస్‌ ఓవర్‌ గేమ్‌కు అర్హత సాధించింది. మ్యాచ్‌ ఆరంభంలో ఇరు జట్లు ఆచితూచి ఆడినా... రెండో క్వార్టర్‌లో దూకుడు పెంచిన ఫ్రాన్స్‌ ఐదు గోల్స్‌తో దుమ్మురేపింది. గెనెస్టాట్‌ హ్యూగో (18వ నిమిషంలో), చార్లెట్‌ విక్టర్‌ (23వ నిమిషంలో), కాయిస్‌ అరిస్టిడ్‌ (26వ నిమిషంలో), బూమ్‌గార్టెన్‌ గాస్పర్డ్‌ (30వ నిమిషంలో), ఫ్రాన్సిస్‌ గోయెట్‌ (54వ నిమిషంలో) తలా ఓ గోల్‌ చేశారు. అర్జెంటీనా తరఫున గొన్‌జాలో (44వ, 48వ నిమిషాల్లో) రెండు, మార్టినెజ్‌ లుకాస్‌ (28వ నిమిషంలో) ఒక గోల్‌ సాధించిన తమ జట్టును గెలిపించలేకపోయారు.    

స్పెయిన్, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ‘డ్రా’
స్పెయిన్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. స్పెయిన్‌ తరఫున అల్బర్ట్‌ బెల్ట్రాన్‌ (9వ నిమిషంలో), అల్వారో ఇగ్లేసియాస్‌ (27వ నిమిషంలో) చెరో గోల్‌ చేయగా... న్యూజిలాండ్‌ తరఫున ఫిలిప్స్‌ (50వ నిమిషంలో), కేన్‌ రసెల్‌ (56వ నిమిషంలో) గోల్స్‌ చేశారు. పూల్‌ ‘ఎ’లో లీగ్‌ మ్యాచ్‌లు పూర్తి కావడంతో అగ్రస్థానంలో నిలిచిన అర్జెంటీనా (6 పాయింట్లు) నేరుగా క్వార్టర్స్‌ చేరగా... రెండు, మూడు స్థానాల్లో నిలిచిన ఫ్రాన్స్‌ (4 పాయింట్లు), న్యూజిలాండ్‌ (4 పాయింట్లు) క్రాస్‌ ఓవర్‌ గేమ్‌కు అర్హత సాధించాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement