నామినేషన్‌ తిరస్కరణ అన్యాయం

Former HCA President Vivek Fire On Azharuddin And BCCI - Sakshi

హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్‌ ఆగ్రహం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవి కోసం తాను దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించడం అన్యాయమని మాజీ అధ్యక్షుడు జి.వివేక్‌ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగ ళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫిక్సింగ్‌కు పాల్పడిన అజహరుద్దీన్‌ను వెనుకేసుకొస్తూ, క్రికెట్‌ అభివృద్ధికి కృషి చేసిన తన నామినేషన్‌ను తిరస్కరించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు.

‘క్రమశిక్షణా కమిటీ విచారణలో తాను ఫిక్సింగ్‌ చేసినట్లు స్వయంగా అజహరుద్దీన్‌ ఒప్పుకున్నారు. అయినా అతని నామినేషన్‌ స్వీకరించారు. ఇప్పటికీ బీసీసీఐ అతనిపై నిషేధాన్ని ఎత్తివేయలేదు. నిషేధాన్ని ఎత్తివేస్తే అందుకు సంబంధించిన పత్రాల్ని బయట పెట్టమనండి. బీసీసీఐ నుంచి నిధులు రాకున్నా సొంత ఖర్చుతో టి20 లీగ్‌ నిర్వహించా. నాపై తప్పుడు రిపోర్టులు సృష్టించి హెచ్‌సీఏకు దూరం చేశారు’ అని ధ్వజమెత్తారు. తమ ప్యానెల్‌నుంచి అధ్యక్షుడిగా ప్రకాశ్‌ చంద్‌ జైన్, ఉపాధ్యక్షునిగా దల్జీత్‌ సింగ్, కార్యదర్శిగా వెంకటేశ్వరన్, సంయుక్త కార్యదర్శిగా శివాజీ యాదవ్‌లను గెలిపించాలని కోరారు.

క్రీడల్లోనూ రాజకీయాలు ఎక్కువయ్యాయని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే చక్రం తిప్పుతోన్న కల్వకుంట్ల కుటుంబం... క్రీడల్లోనూ తన వర్గాన్ని తయారుచేసే దిశగా పావులు కదుపుతోందని ఆరోపించారు. ఆ ప్రయత్నంలోనే అజహరుద్దీన్‌తో చేతులు కలిపిన కేటీఆర్‌ తాజా హెచ్‌సీఏ ఎన్నికల్లో అజహర్‌కే ఓటువేయాలంటూ ఓటర్లని ప్రభావితం చేస్తున్నారన్నారు. అజహరుద్దీన్‌ తర్వాత కవితకు అవకాశం ఇవ్వాలనే ప్రణాళికతోనే ఇదంతా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top