అరుణ్‌ జైట్లీ: క్రికెట్‌తో ఎనలేని అనుబంధం

Former Central Minister Arun Jaitley Longest Serving President Of DDCA - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ అగ్రనేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ(66) మరణం పట్ల యావత్‌ భారతావని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా జైట్లీ దేశానికి అందించిన సేవలను రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు స్మరించుకుంటున్నారు. ఢిల్లీ డిస్ట్రిక్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) అధ్యక్షుడిగా ఆయన సుదీర్ఘ కాలం(1999-2013) ఢిల్లీ క్రికెట్‌కు సేవలందించారు. అంతేకాకుండా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు.  ఈ సమయంలోనే జైట్లీకి క్రికెట్‌తో ఎనలేని బంధం ఏర్పడింది. బీసీసీఐతో ఉన్న సత్ససంబంధాలతో ప్రతిభ ఉన్న ఢిల్లీ ఆటగాళ్లను టీమిండియా తరుపున ఆడించే ప్రయత్నం చేశారు.  ప్రతిభావంతులైన క్రికెటర్లను ప్రొత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే వారు. 

ఇక ఢిల్లీ క్రికెట్‌ అభివృద్దికి ఎనలేని కృషి చేశారు. డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆటగాళ్లకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో తీవ్ర కృషి చేశారు. ప్రస్తుతం ఢిల్లీ ఆటగాళ్లు టీమిండియా తరుపున ఆడుతున్నారంటే అది జైట్లీ చలవే అని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా తాజా, మాజీ క్రికెటర్లు సోషల్‌ మీడియా వేదికగా ఆరుణ్‌ జైట్లీతో తమకున్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

 

టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ జైట్లీ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘అరుణ్‌ జైట్లీ మరణం వ్యక్తిగతంగా నన్ను ఎంతో బాధించింది. ఆయనతో నాకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది. ఎప్పుడు కలిసినా ప్రేమగా పలకరించేవారు. ఢిల్లీ డిస్ట్రిక్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే నాతో సహా ఎంతో మంది ఢిల్లీ ఆటగాళ్లు దేశానికి ఆడారు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో, ఆటగాళ్ల సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుండే వారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’ అంటూ ట్వీట్‌ చేశారు. 

వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు గౌతమ్‌ గంభీర్‌, హర్భజన్‌ సింగ్‌, శిఖర్‌ ధావన్‌, హర్భజన్‌ సింగ్‌, మహ్మద్‌ కైఫ్‌, సురేష్‌ రైనా, హర్ష బోగ్లే, తదితర ఆటగాళ్లు అరుణ్‌ జైట్లీ మరణానికి ట్విటర్‌ వేదికగా సంతాపం తెలిపారు.

చదవండి: 
అరుణ్‌ జైట్లీ అస్తమయం

అరుదైన ఫోటో ట్వీట్‌ చేసిన కపిల్‌ సిబల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top