
తొలిసారి క్వార్టర్స్‌కు చేరిన ముగ్గురు భారతీయులు
బ్యాడ్మింటన్‌లో చైనా చరిత్రకు తెలుగు దెబ్బ. నిన్న సైనా... నేడు సింధు... డ్రాగన్‌లను వణికిస్తున్నారు. అద్భుతమైన ఆట తీరుతో దశాబ్దాల ఆధిపత్యానికి వరుస విజయాలతో గండి కొడుతూ...
బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజాల పెను సంచలనం... ఇప్పటికే సంచలనాలకు మారుపేరుగా మారిన హైదరాబాదీ షట్లర్లు... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో దుమ్మురేపారు. కొత్త సంచలనం పి.వి.సింధు ఏకంగా ప్రపంచ ఐదో ర్యాంకర్ యిహాన్ వాంగ్‌ను కంగుతినిపిస్తే... సైనా కాస్త కష్టపడ్డా గట్టెక్కింది.
పురుషుల విభాగంలో కశ్యప్ కూడా ఆరోసీడ్ యున్ హు (హాంకాంగ్)ను ఓడించాడు. దీంతో మొత్తం ముగ్గురు తెలుగు తేజాలు క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. బ్యాడ్మింటన్ చరిత్రలో ముగ్గురు భారతీయులు ఒకేసారి ప్రపంచ చాంపియన్‌షిప్ క్వార్టర్స్‌కు చేరడం ఇదే తొలిసారి. ఇన్నాళ్లూ చైనాకు సైనా ముచ్చెమటలు పట్టిస్తే... ఇప్పుడు సింధు కూడా డ్రాగన్ మెడలు వంచే సత్తా తనలో ఉందని నిరూపించింది.
గ్వాంగ్‌జూ (చైనా): బ్యాడ్మింటన్‌లో చైనా చరిత్రకు తెలుగు దెబ్బ. నిన్న సైనా... నేడు సింధు... డ్రాగన్‌లను వణికిస్తున్నారు. అద్భుతమైన ఆట తీరుతో దశాబ్దాల ఆధిపత్యానికి వరుస విజయాలతో గండి కొడుతూ.... అందని ద్రాక్షగా మిగిలిపోతున్న ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ దిశగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ పి.వి.సింధు సంచలన విజయం నమోదు చేస్తే, మూడో ర్యాంకర్ సైనా శ్రమించి గెలిచింది. పురుషుల విభాగంలో 13వ సీడ్ కశ్యప్ దూకుడును కొనసాగించి క్వార్టర్స్‌కు చేరాడు.
సింధు 21-18, 23-21తో యిహాన్ వాంగ్ (చైనా)పై
ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వాంగ్‌కు సింధు 55 నిమిషాల్లో చెక్ పెట్టింది. తొలి గేమ్ ఆరంభంలో ఇద్దరూ 8-8తో స్కోరును సమం చేశారు. తర్వాత నెట్ వద్ద అప్రమత్తంగా వ్యవహరించిన సింధు 12-9 ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే చైనా అమ్మాయి కూడా దూకుడును పెంచడంతో స్కోరు 16-16తో సమమైంది. ఈ దశలో సింధు వరుసగా రెండు పాయింట్లు గెలిస్తే.. వాంగ్ ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకుంది. తర్వాత మరో రెండు పాయింట్లు గెలిచిన హైదరాబాదీ గేమ్‌ను సొంతం చేసుకుంది.
రెండో గేమ్‌లోనూ స్కోరు 6-6 ఉన్న దశలో సింధు వరుస పాయింట్లతో హోరెత్తించి 13-7 ఆధిక్యంలో నిలిచింది. కొద్దిసేపు ఇదే ఆధిక్యాన్ని కొనసాగించినా వాంగ్ పోరాటం ముందు కాస్త వెనుకబడింది. దీంతో స్కోరు 20-17 అయ్యింది. ఇక్కడ చైనా క్రీడాకారిణి వరుసగా మూడు పాయింట్లు గెలిచి 20-20తో సమం చేసింది. తర్వాత ఇద్దరికీ చెరో పాయింట్ రావడంతో స్కోరు 21-21తో సమమైంది. ఈ దశలో సుదీర్ఘ ర్యాలీలు ఆడిన సింధు షాట్లలో భిన్నత్వాన్ని కనబర్చి రెండు పాయింట్లను సొంతం చేసుకుంది. క్వార్టర్స్‌లో సింధు... షిజియాన్ వాంగ్ (చైనా)తో తలపడుతుంది.
కశ్యప్ 21-13, 21-16తో యున్ హూ (హాంకాంగ్)పై
ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో కశ్యప్ సులువుగా పైచేయి సాధించాడు. కేవలం 37 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. యున్ హూ 9 ర్యాలీలు సాధిస్తే... కశ్యప్ 16 ర్యాలీలతో అదరగొట్టాడు. స్మాష్‌ల్లోనూ ఏపీ కుర్రాడు చెలరేగాడు. 17 పాయింట్లు గెలిచాడు. తొలి గేమ్‌లో 14-7 ఆధిక్యాన్ని సాధించిన కశ్యప్ ఆ తర్వాత కూడా జోరును కనబర్చాడు. రెండో గేమ్‌లోనూ హాంకాంగ్ ప్లేయర్ తడబడ్డాడు. దీంతో హైదరాబాద్ స్టార్ మళ్లీ 14-7 ఆధిక్యంలో నిలిచాడు. అయితే యున్ హు వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి ఆధిక్యాన్ని 11-14కు తగ్గించాడు. చివరకు 15-15తో స్కోరును సమం చేశాడు. తర్వాత కశ్యప్ వరుసగా రెండుసార్లు మూడు, మూడు పాయింట్లు నెగ్గి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.
క్వార్టర్స్‌లో కశ్యప్... ప్రపంచ మూడో ర్యాంకర్ పెంగ్యూ డూ (చైనా)తో తలపడతాడు.
‘డ్రాగన్’ గుండెల్లో గుబులు!
దశాబ్ద కాలంగా చైనా బ్యాడ్మింటన్‌లో అంచెలంచెలుగా ఎదిగి ఆటపై గుత్తాధిపత్యం సంపాదించింది. కానీ గత మూడేళ్లుగా సైనా చైనా క్రీడాకారిణులకు భయం పుట్టిస్తోంది. కానీ సరైన వ్యూహాలు, పక్కా ప్రణాళికతో సైనాకు చెక్ పెడుతున్నారు. అయితే ఇప్పటికీ సైనా ఎదురవుతుంటే జాగ్రత్తగా ఉంటున్నారు.
ఈసారీ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సైనా కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కానీ తొలిసారి ఈ మెగా టోర్నీలో ఆడుతున్న మరో భారత సంచలనం గురించి పట్టించుకోలేదేమో..! సింధు దగ్గర నైపుణ్యం ఉన్నా... తమకు ఇలాంటి షాక్ ఇస్తుందని మాత్రం చైనా ఊహించి ఉండదు.
బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు టైటిల్ గెలవొచ్చు... గెలవకపోవచ్చు. కానీ యిహాన్ వాంగ్‌పై విజయం మాత్రం సింధు కెరీర్‌లోనే అతి పెద్ద విజయం అనుకోవాలి. గతంలో సైనా నెహ్వాల్...
చివర్లో 21-21 దగ్గర స్కోర్ సమం అయినప్పుడు పాయింట్ కోసం సుమారు 50 ర్యాలీలు ఆడాల్సి వచ్చింది. ఒకదశలో కింద పడిపోతానేమో అనిపించింది. కానీ ప్రత్యర్థి కూడా అంతే అలసిపోయింది. డ్రిబ్లింగ్ ను ఎదుర్కోలేక కిందపడిపోయింది. ఆ క్షణంలో సాధించిన పాయింట్ ఇప్పటివరకు నా జీవితంలో అత్యుత్తమం అనిపించింది. ఈ విజయాన్ని ఎలా వర్ణించాలో అర్థం
కావడం లేదు. వందశాతం నా ఆటతీరును ప్రదర్శించాలనే పట్టుదలతో మ్యాచ్ మొదలు
పెట్టాను.
- చైనా నుంచి ‘సాక్షి’తో సింధు
వాంగ్ చేతిలో ఏడు మ్యాచ్‌లు ఆడితే ఆరుసార్లు ఓడిపోయింది. 2012 డెన్మార్క్ ఓపెన్‌లో సైనా ఆధిక్యంలో ఉన్న సమయంలో వాంగ్ గాయం కారణంగా వైదొలిగింది. ఈ ఒక్క సందర్భంలో మినహా ప్రతిసారీ సైనాపై వాంగ్‌దే పైచేయి. అలాంటిది సింధు తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ బరిలోకి దిగినా చైనా డ్రాగన్‌కు వెరవకుండా పోరాడింది. గోపీచంద్ దగ్గర శిక్షణ, ఒలింపిక్ గోల్డ్‌క్వెస్ట్ సహకారంతో దూసుకుపోతున్న సింధు ప్రస్తుతం చైనా గుండెల్లో గుబులు రేపుతోంది. 2012లో చైనా మాస్టర్స్ సిరీస్‌లో లీ జువేరీ (ఒలింపిక్ స్వర్ణ పతక విజేత) మీద గెలిచిన చరిత్ర సింధుకు ఉంది.
ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం చైనా పకడ్బందీగా సన్నద్ధం అయింది. చాలా మెగా టోర్నీల్లో తమ ఆటగాళ్లు ఆడకుండా విశ్రాంతి ఇచ్చింది. కానీ సింధు దెబ్బకు బిత్తరపోయింది. క్వార్టర్ ఫైనల్లో సింధు ప్రత్యర్థి షిజియాన్ వాంగ్. మరోసారి డ్రాగన్‌తో పోరాటం. అయితే వాంగ్‌పై ఈ ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో మూడు నెలల క్రితం సింధు గెలిచింది. ఈ ఆత్మవిశ్వాసం కచ్చితంగా ఈ భారత యువ షట్లర్‌కు లాభించే అంశం.
- సాక్షి క్రీడావిభాగం
సైనా 18-21, 21-16, 21-14తో పోర్న్‌టిప్ (థాయ్‌లాండ్)పై
ముఖాముఖి రికార్డులో సైనాదే పైచేయి ఉన్నా ఈ మ్యాచ్‌లో మాత్రం 15వ సీడ్ పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్‌సుక్ నుంచి కాస్త పోటీ ఎదురైంది. అయితే కీలక సమయంలో వ్యూహాత్మకంగా ఆడిన ప్రపంచ మూడో ర్యాంకర్ చివరి రెండు గేమ్‌ల్లో దుమ్మురేపింది. తన ట్రేడ్ మార్క్ అయిన డ్రాప్ షాట్లు, స్మాష్‌లతో అలరించింది. 52 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ఇద్దరు నిలకడగా ఆడారు.
చివర్లో కాస్త అలసత్వం ప్రదర్శించిన సైనా గేమ్‌ను చేజార్చుకుంది. కానీ రెండో గేమ్‌లో ప్రత్యర్థిని సైనా దరిదాపుల్లోకి రానివ్వలేదు. 8-4 తర్వాత వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 15-4 ఆధిక్యంలో నిలిచింది. తర్వాత పోర్న్‌టిప్ కాస్త పుంజుకున్నట్లు కనిపించినా హైదరాబాదీ మాత్రం అవకాశం ఇవ్వలేదు. మూడో గేమ్‌లోనూ సైనా అదే జోరును కనబర్చింది. 17-14 ఆధిక్యాన్ని సాధించి చకచకా 4 డ్రాప్‌లతో మ్యాచ్‌ను ముగించింది. మ్యాచ్ మొత్తంలో సైనా స్మాష్‌ల ద్వారా 16, నెట్ వద్ద 7, ర్యాలీల ద్వారా మూడు పాయింట్లు గెలిచింది.
క్వార్టర్స్‌లో సైనా... యువాన్ జు బే (కొరియా)తో తలపడుతుంది.