ఇక బుమ్రాతో పోటీ షురూ చేయాల్సిందే..!

Fans Troll Razzaq For Calling Jasprit Bumrah Baby Bowler - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అసలు పూర్తిస్థాయి బౌలరే కాదని, అతనొక బేబీ బౌలర్‌ అంటూ తన అక్కసును వెళ్లగక్కిని పాకిస్తాన్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ అబ్దుల్‌ రజాక్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక బుమ్రాతో రజాక్‌కు పోటీ పెట్టిల్సిందేనంటూ కౌంటర్‌ అటాక్‌కు దిగారు. ‘బుమ్రాకు నీకు ఒక ఓవర్‌ పోటీ పెడదాం. ఆ ఓవర్‌లో నువ్వు ఎన్ని పరుగులు కొడతావో చూద్దాం. అసలు ఫస్ట్‌బాల్‌కే ఔట్‌ అవ్వకుండా ఉంటే చూద్దాం’ అని ఒక అభిమాని ఎద్దేవా చేయగా, ‘  36 పరుగులు- 6 బంతులు.. ఇది రజాక్‌ బ్యాటింగ్‌కు బుమ్రా బౌలింగ్‌కు పోటీ’ అంటూ మరొకరు సవాల్‌ విసిరారు.

‘ ఇది కదా జోక్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అంటే అని మరొక అభిమాని సెటైర్‌ వేశాడు. ‘ 2011 వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్‌ మునాఫ్‌ పటేల్‌ 115 కి.మీ వేగతంతో వేసిన బంతికి బౌల్డ్‌ అయ్యావ్‌.. గుర్తు లేదా. ఇంకా వేగంగా వేసే బౌలర్లు కావాలా’ అంటూ మరొకరు విమర్శించారు. ‘ ఆసీస్‌ దిగ్గజం మెక్‌ గ్రాత్‌పైనే ఆధిపత్యం కొనసాగించావా.. టెస్టుల్లో మెక్‌గ్రాత్‌ నీకు 113 బంతులు వేస్తే 20 పరుగులు చేసి రెండు సార్లు ఔటయ్యావ్‌.. ఇక వన్డేల్లో మెక్‌గ్రాత్‌ వేసిన 35 బంతుల్లో 39 పరుగులు చేసి మూడుసార్లు పెవిలియన్‌ చేరావ్‌.. ఇదేనా నీ అధిపత్యం’ అని మరొక అభిమాని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇలా రజాక్‌పై సోషల్‌ మీడియాలో అభిమానులు ఇష్టం వచ్చినట్లు ట్రోల్‌ చేస్తున్నారు.

అసలు రజాక్‌ ఏమన్నాడంటే..‘నేను ప్రపంచ వ్యాప్తంగా అన్ని మైదానాల్లో ప్రపంచ శ్రేణి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. దీంతో బుమ్రా నాకు పెద్ద సమస్యే కాదు. నా దృష్టిలో బుమ్రా బేబీ బౌలర్‌. అతడి బౌలింగ్‌లో అవలీలగా పరుగులు సాధిస్తా. గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, వసీం ఆక్రమ్‌, షోయాబ్‌ అక్తర్‌ వంటి ఆల్‌టైమ్‌ వరల్డ్‌ క్లాస్‌ బౌలర్లను ఎదుర్కొంటే బ్యాట్స్‌మన్‌కు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నా విషయంలో అదే జరిగింది. నేను క్రికెట్‌ ఆడే సమయంలో ప్రపంచ శ్రేణి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాననే విషయం బుమ్రాకు కూడా తెలుసు’ అని రజాక్‌ అన్నాడు. దాంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ నోటికి పని చెప్పాడు రజాక్‌.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top