ఆ విజయం.. మాక్కూడా కష్టంగానే ఉంది: మోర్గాన్‌

Eoin Morgan Comment on World Cup 2019 final - Sakshi

ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫలితాన్ని న్యూజిలాండ్‌ జట్టు దిగమింగుకోలేకపోయింది. తమ శక్తివంచన లేకుండా పోరాడి.. అద్భుతంగా ఆడినా.. ఆ జట్టును పరాజయం వెక్కిరించింది. దీనిని ఓటమి అనడం కంటే.. ఐసీసీ చెత్త రూల్స్‌ వల్లే ఇలా జరిగిందని పేర్కొనడం మంచిదని, ఫైనల్‌ మ్యాచ్‌లో ఇరు జట్లూ విజయం సాధించాయని చాలా మంది మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు. 

తాజాగా ప్రపంచకప్‌ విజేత ఇంగ్లండ్‌ జట్టు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫలితంపై స్పందించాడు. టైమ్స్‌ మ్యాగజీన్‌తో ఆయన మాట్లాడుతూ.. ఫైనల్‌ ఫలితం తమకు కూడా కష్టంగానే అనిపించిందని పేర్కొన్నాడు. సూపర్‌ ఓవర్‌లోనూ ఇరు జట్ల స్కోరు సమం అయిన నేపథ్యంలో బౌండరీ సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్‌ జట్టును టెక్నికల్‌గా విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల స్కోరు సమమైనప్పుడు.. ఇలా బౌండరీల నిబంధన ప్రకారం మ్యాచ్‌ ఫలితాన్ని తేల్చడం తన దృష్టిలో సబబు కాదని మోర్గాన్‌ తేల్చి చెప్పాడు. ’ ఇరు జట్లు సమంగా పోరాడిన సమయంలో ఇలాంటి ఫలితాన్ని ప్రకటించడం నాకు సమంజసంగా అనిపించలేదు. నేను ఉన్నప్పుడు ఇది జరిగిన విషయం వాస్తవమే కానీ, ఎక్కడ మేం గెలిచామో.. ఎక్కడ ఓడామో నేను చెప్పలేను. ఇలా గెలువడం మంచిదేనని నేను అనను. ఇక, ఓడిపోవడమనేది చాలా కష్టమైన విషయం’ అని చెప్పాడు. ఫైనల్‌ తర్వాత న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌తో అనేక సార్లు మాట్లాడానని, కానీ ఇది ఎలా జరిగిందో తమకు ఇప్పటికీ అర్థం కాలేదని, ఈ ఫలితంపై తాము ఓ నిర్ధారణకు రాలేకపోయామని చెప్పారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top