జొకోవిచ్‌ నాలుగోసారి...

Djokovic wins World Sportsman of the Year at Laureus World Sports Awards - Sakshi

వరల్డ్‌ స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు సొంతం

ఉత్తమ క్రీడాకారిణిగా సిమోన్‌ బైల్స్‌ 

లారెస్‌ క్రీడా పురస్కారాల ప్రదానం  

మొనాకో: అద్భుత ఫామ్‌తో వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలుచుకున్న సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రతిష్టాత్మక 2019 లారెస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ అవార్డుల్లో అతను ప్రపంచ ఉత్తమ క్రీడాకారుడిగా నిలిచాడు. అతను ఈ అవారున్డు గెలుచుకోవడం నాలుగోసారి కావడం విశేషం. దీంతో జమైకా మేటి అథ్లెట్‌ ఉసేన్‌ బోల్ట్‌ రికార్డును జొకో సమం చేయగా... ఫెడరర్‌ ఐదు లారెస్‌ అవార్డులతో అగ్రస్థానంలో ఉన్నాడు. గత సంవత్సరం వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌ సాధించడంతో పాటు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరిన జొకోవిచ్‌ ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.  ప్రపంచ వ్యాప్తంగా 68 మంది సభ్యుల లారెస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ అకాడమీ 2018లో సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుంటూ విజేతలను ఎంపిక చేసింది.   అమెరికాకు చెందిన టాప్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ ‘స్పోర్ట్స్‌ ఉమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకు ఎంపికైంది. గత ఏడాది వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెలిచిన ప్రదర్శనకు ఈ అవార్డు దక్కింది. ‘టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు ‘ఫిఫా’ ప్రపంచ కప్‌ గెలుచుకున్న ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ జట్టుకు లభించింది. టెన్నిస్‌లో మహిళల వరల్డ్‌ నంబర్‌వన్‌ నయోమి ఒసాకా (జపాన్‌)కు ‘బ్రేక్‌ త్రూ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు లభించింది. తొలిసారి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచే క్రమంలో దిగ్గజ క్రీడాకారిణి సెరెనాపై ఫైనల్లో సాధించిన విజయం ఆమెకు ఈ అవార్డు తెచ్చి పెట్టింది. మారథాన్‌లో ప్రపంచ రికార్డు (2 గంటల 1.39 నిమిషాలు) నెలకొల్పిన ఇలియుడ్‌ కిప్‌జోగె (కెన్యా)ను లారెస్‌ ‘ప్రత్యేక ఘనత’ అవార్డుతో సత్కరించింది. 22 ఏళ్ల పాటు ఫుట్‌బాల్‌ క్లబ్‌ అర్సెనల్‌కు మేనేజర్‌గా వ్యవహరించిన ఆర్సెన్‌ వెంగర్‌కు ‘లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌’ అవార్డు లభించింది.
 
వినేశ్‌కు నిరాశ... 

లారెస్‌ స్పోర్ట్స్‌ అవార్డులకు నామినేట్‌ అయిన తొలి భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందిన మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు ‘కమ్‌ బ్యాక్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు దక్కలేదు. రియో ఒలింపిక్స్‌లో తీవ్రంగా గాయపడిన వినేశ్‌... ఆ తర్వాత కోలుకొని గత ఏడాది కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించడంతో ఈ అవార్డుకు నామినేట్‌ అయింది. ఈ విభాగంలో అమెరికా గోల్ఫ్‌ దిగ్గజం టైగర్‌ వుడ్స్‌కు అవార్డు దక్కింది. ఐదేళ్ల విరామం తర్వాత అతను టూర్‌ చాంపియన్‌షిప్‌ సాధించడం విశేషం. 

‘యువ’కు అవార్డు
జార్ఖండ్‌ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు చెందిన అమ్మాయిల జీవితాల్లో క్రీడల ద్వారా మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘యువ’కు ‘స్పోర్ట్‌ ఫర్‌ గుడ్‌ అవార్డ్‌’ దక్కింది. 2009లో ఈ సంస్థను అమెరికాకు చెందిన ఫ్రాన్జ్‌ గాస్ట్‌లర్‌ స్థాపించాడు. ఇక్కడ దాదాపు 450 మంది అమ్మాయిలు ఫుట్‌బాల్‌లో శిక్షణ పొందుతున్నారు. 2015లో ‘యువ’ స్కూల్‌ను ప్రారంభించి ఆటతో పాటు చదువు కూడా చెబుతున్నారు. వీరంతా ప్రొఫెషనల్స్‌ తరహాలో ఫుట్‌బాల్‌ పోటీల్లో పాల్గొనకపోయినా... బాల్య వివాహాలు, అక్రమ రవాణావంటి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా అమ్మాయిలను తీర్చిదిద్దుతారు. కార్యక్రమంలో ‘యువ’ తరఫున హిమ, నీతా, రాధ, కోనిక అవార్డును స్వీకరించారు.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top