
నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్
బరిలో సినెర్, జొకోవిచ్
నాదల్ శకం తర్వాత ‘క్లే’పై తొలి గ్రాండ్‌స్లామ్
పారిస్: సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌కు నేడు తెర లేవనుంది. గతేడాది ఒలింపిక్స్‌లో తలపడిన టెన్నిస్ సూపర్ స్టార్లందరూ మళ్లీ పారిస్‌లో పోరాడేందుకు వచ్చేశారు. క్లే కోర్టులో సత్తా చాటేందుకు సై అంటున్నారు. డిఫెండింగ్ చాంపియన్ అల్‌కరాజ్ (స్పెయిన్) ట్రోఫీని నిలబెట్టుకునే పనిలో ఉంటే... ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) టైటిల్ సాధించేందుకు వచ్చాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌తో సత్తా చాటుకున్న సినెర్ డోపింగ్ మరకను దాటేశాడు.
ఇప్పుడిక్కడ ప్రెంచ్ ముచ్చట తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. వీరిద్దరితో పాటు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ కూడా 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం కాచుకున్నాడు. దీనికోసం రెండేళ్లుగా పెద్ద పోరాటమే చేస్తున్నాడు. ఈ సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీస్ చేరిన నొవాక్ రోలండ్ గారోస్‌లో చివరిసారిగా 2023లో టైటిల్ గెలిచాడు. ఆ ఏడాది వింబుల్డన్ (రన్నరప్) తప్ప మూడు టైటిళ్లను కైవసం చేసుకున్న జొకోవిచ్‌కు గత సీజన్ తీవ్ర నిరాశను మిగిల్చింది.
ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు. దీంతో ‘గ్రాండ్‌స్లామ్ రజతోత్సవం’ కోసం ఈ ఫ్రెంచ్ ఓపెన్‌లో సెర్బియన్ స్టార్ గంపెడాశలతో బరిలోకి దిగుతున్నాడు. సరిగ్గా తొమ్మిది నెలల క్రితం ఇక్కడే ఒలింపిక్స్‌లో చాంపియన్‌గా నిలిచిన జొకోకు మళ్లీ కాలం కలిసొస్తే ‘గ్రాండ్–25’ సాకారం అవుతుంది.
తొలి రౌండ్లలో నిరుటి విజేత అల్‌కరాజ్... క్వాలిఫయర్ గులియో జెప్పియెరి (ఇటలీ)తో, సినెర్... రిండెర్క్‌నెచ్ (ఫ్రాన్స్)తో, ఆరో సీడ్ జొకోవిచ్... షెవ్‌చెంకో (కజకిస్తాన్)తో ఫ్రెంచ్ సమరాన్ని ప్రారంభించనున్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత నాదల్ లేని క్లేకోర్ట్ ఈవెంట్ జరగబోతోంది. 2005 నుంచి 2024 వరకు పోటీపడిన స్పెయిన్ దిగ్గజం 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లలో 14 ఫ్రెంచ్ ఓపెన్‌లోనే సాధించడం విశేషం.
సబలెంక, స్వియాటెక్‌లే ఫేవరెట్లు
మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ అరియాన సబలెంక (బెలారస్), స్వియాటెక్ (పోలండ్)లు టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. గతేడాది ఆస్ట్రేలియన్, యూఎస్ ఓపెన్‌లు గెలిచిన సబలెంకకు ఈ ఏడాది ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో టైటిల్ పోరులో చుక్కెదురైంది. ఇప్పుడు టైటిల్ గెలిచేదాకా నిలకడైన ఆటతీరును కనబరచాలనే లక్ష్యంతో ప్రపంచ నంబర్‌వన్ సబలెంక బరిలోకి దిగుతోంది.
మరోవైపు ‘క్లేకోర్టు రాణి’గా ఎదిగిన స్వియాటెక్ రోలండ్ గారోస్‌లో ఐదో టైటిల్‌పై కన్నేసింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆమె హ్యాట్రిక్ సహా నాలుగు (2020, 2022, 2023, 2024) ట్రోఫీలు సాధించింది. తొలి రౌండ్ పోటీల్లో రష్యన్ అన్‌సీడెడ్ రకిమొవాతో సబలెంక... రెబెక్కా స్రాంకొవా (స్లొవేకియా)తో స్వియాటెక్ పోటీపడనున్నారు.
గత యూఎస్ ఓపెన్ రన్నరప్, మూడో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా)... రొమేనియన్ ప్లేయర్ అన్క టొడోనితో, ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్ మాడిసన్ కీస్ (అమెరికా) క్వాలిఫయర్ డెరియా సవిల్లే (ఆస్ట్రేలియా)తో... రెండో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) అన్‌సీడెడ్ ఒలీవియా గడెకి (ఆ్రస్టేలియా)తో తలపడతారు.