
జట్టులో ఎలాంటి గొడవలు లేవని, అంతా సవ్యంగానే ఉందనే స్టేట్‌మెంట్ ఇవ్వాలని ఓ సీనియర్ ఆటగాడిని కోరాడు
న్యూఢిల్లీ : ప్రపంచకప్ నిష్క్రమణతో భారత జట్టులో విభేదాలు నెలకొన్నాయని, ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలకు పడటం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుండటం.. మీడియాలో వరుస కథనాలు రావడం తెలిసిందే. అయితే ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం బీసీసీఐ, సుప్రీం నియమిత పాలక మండలి (సీఓఏ) చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారానికి అక్కడే ముగింపు పలకాలని యోచించినట్లు సమాచారం. అసలు జట్టులో గొడవలే లేవని, అంతా బాగుందని ఓ సీనియర్ ఆటగాడితో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టించే ప్రయత్నం జరిగినట్లు బోర్డ్ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
‘భారత జట్టులో విభేదాలు అంటూ మీడియాలో వస్తున్న కథనాలపై కలవరపాటుకు గురైన సీఓఏ వాటికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. ఈ మేరకు ఒక సభ్యుడు జట్టులో ఎలాంటి గొడవలు లేవని, అంతా సవ్యంగానే ఉందనే స్టేట్‌మెంట్ ఇవ్వాలని ఓ సీనియర్ ఆటగాడిని కోరాడు. కానీ ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు’ అని ఆ అధికారి పేర్కొన్నారు. మీడియాలో వచ్చే కథనాలపై సీఓఏ ఎన్నటికీ స్పందించదని, ఆటగాళ్లకు సమస్యలుంటే వారే తమ ముందుకు తీసుకు వస్తారని తెలిపారు. అప్పటి వరకు ఆటగాళ్ల మధ్య ఎలాంటి గొడవలు లేవనే సీవోఏ భావిస్తోందన్నారు. అయితే రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అన్‌ఫాలో కావడంతో ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్లైందని, అందుకే సీఓఏ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆ అధికారి పేర్కొన్నారు. అయితే సీఓఏ ప్రతిపాదనను ఆ సీనియర్ ఆటగాడు తిరస్కరించినట్లు అనధికారికంగా తెలిసింది.
మరో అధికారి మాట్లాడుతూ.. జట్టుపై జరుగుతున్న ప్రచారానికి ఎంత త్వరగా ముగింపు పలికితే అంత మంచిదని, లేకుంటే ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపుతుందన్నారు. ‘ఆటగాళ్ల మధ్య విభేదాలుంటే అది జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతోంది. ఈ సమస్యను ఇప్పుడే పరిష్కరించకపోతే ఆటగాళ్ల మధ్య సఖ్యత దెబ్బతీనడంతో పాటు ఫలితంపై ప్రభావం చూపుతోంది. ఇదంతా మీడియా సృష్టేనని ఓ పెద్దాయన అన్నారు. మీడియా సృష్టి అయినప్పుడు ఎందుకు కలవరపాటుకు గురవుతున్నారు?’ అని సదరు అధికారి ప్రశ్నించారు.