భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఫిల్ హ్యూస్ మైదానంలో గాయపడటం... ఆ తర్వాత అతను మృతి చెందడంతో వారం రోజుల పాటు క్రికెట్ గురించి ఎవరూ మాట్లాడలేదు.
నేటి నుంచి భారత్‌కు ప్రాక్టీస్ మ్యాచ్
శుక్రవారం జట్టుతో చేరనున్న ధోని
అడిలైడ్: భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఫిల్ హ్యూస్ మైదానంలో గాయపడటం... ఆ తర్వాత అతను మృతి చెందడంతో వారం రోజుల పాటు క్రికెట్ గురించి ఎవరూ మాట్లాడలేదు. అంతా హ్యూస్ గురించే చర్చ. బుధవారం హ్యూస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
ఇక గురువారం నుంచి మళ్లీ క్రికెట్ మీద దృష్టి సారించనున్నారు. గ్లెనెల్గ్‌లోని గ్లిడొరెల్ స్టేడియంలో జరిగే రెండు రోజుల మ్యాచ్‌లో భారత్... క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో తలపడుతుంది. హ్యూస్ అంత్యక్రియలకు హాజరైన విరాట్, రోహిత్, విజయ్ కూడా ఈ మ్యాచ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి టెస్టుకు ముందు ప్రాక్టీస్ కోసం ఇదే చివరి అవకాశం కాబట్టి... తుది జట్టులో ఉండే ఆటగాళ్లందరికీ ఎక్కువ అవకాశం ఇవ్వాలని జట్టు భావిస్తోంది. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరూ రాణించారు. అయితే ఆ తర్వాత ఒకట్రెండు ప్రాక్టీస్ సెషన్లలో మాత్రమే పాల్గొన్నారు.
చేతి గాయం నుంచి కోలుకున్న ధోని శుక్రవారం సాయంత్రం భారత జట్టుతో చేరతాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకుండానే... 9 నుంచి అడిలైడ్‌లోనే జరిగే తొలి టెస్టులో ధోని బరిలోకి దిగుతాడా లేదా అనేది ఆసక్తికరం.