
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) వైఫల్యం కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో డకౌట్ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మరోసారి ఇదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. పెర్త్‌లో ఎనిమిది బంతులు ఎదుర్కొని మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో డకౌట్ అయిన కోహ్లి.. అడిలైడ్ వేదికగా రెండో వన్డే (IND vs AUS 2nd ODI)లోనూ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.
లెగ్ బిఫోర్ వికెట్‌గా
భారత జట్టు ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్లో ఆస్ట్రేలియా యువ పేసర్ జేవియర్ బార్ట్‌లెట్ (Xavier Bartlett) బంతితో రంగంలోకి దిగాడు. ఈ క్రమంలో ఐదో బంతిని ఎదుర్కొన్న కోహ్లి వికెట్ల ముందు అతడికి దొరికిపోయాడు. బార్ట్‌లెట్ సంధించిన బంతిని ఫ్లిక్ షాట్ ఆడబోయిన కోహ్లి విఫలమయ్యాడు. బంతి బ్యాట్‌కు బదులు ప్యాడ్‌కు తాకింది.
VIRAT KOHLI GONE FOR HIS SECOND DUCK OF THE SERIES!#AUSvIND | #PlayoftheDay | @BKTtires pic.twitter.com/jqIdvMeX9T
— cricket.com.au (@cricketcomau) October 23, 2025
అయితే, ఫీల్డ్ అంపైర్ సామ్ నొగాజ్‌స్కి లెగ్ బిఫోర్ వికెట్ (LBW)గా ప్రకటించేందుకు తటపటాయించాడు. అయితే, ఆసీస్ బౌలర్లు అప్పీలు చేసిన వెంటనే అవుట్ అంటూ వేలు పైకెత్తాడు. దీంతో కోహ్లితో పాటు అడిలైడ్ స్టేడియంలోని అభిమానులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. నాలుగు బంతులు ఎదుర్కొన్న కోహ్లి ఇలా మరోసారి సున్నా చుట్టడంతో స్టేడియం అంతా సైలెంట్ అయిపోయింది.
ఇదే తొలిసారి
కాగా వన్డే క్రికెట్‌లో కోహ్లి తన పదిహేడేళ్ల కెరీర్‌లో వరుసగా రెండుసార్లు డకౌట్ కావడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. అవుటైన తర్వాత పెవిలియన్‌కు చేరే క్రమంలో కోహ్లి గ్లోవ్స్ తీసి.. అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ డ్రెసింగ్ రూమ్ వైపు వెళ్లడం రిటైర్మెంట్ వదంతులకు ఊతమిచ్చింది.
డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్‌బై చెప్పేశాడా?
ఆస్ట్రేలియాతో గతేడాది బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లోనూ వరుస వైఫల్యాల నేపథ్యంలో కోహ్లి ఆఖరి మ్యాచ్‌లో ఇలాగే చేశాడంటూ ఫ్యాన్స్ గుర్తుచేసుకున్నారు. ఇక ఆ సిరీస్ తర్వాత కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి తాజా చర్య కూడా వన్డే రిటైర్మెంట్‌కు సంకేతమేనంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
మరికొంత మంది మాత్రం తనకెంతో ఇష్టమైన అడిలైడ్ వేదికపై కోహ్లి చివరి వన్డే ఆడేశాడని.. ఓవల్‌తో పాటు ఇక్కడి అభిమానులకు మాత్రమే గుడ్‌బై చెప్పాడని అభిప్రాయపడుతున్నారు.
భవిష్యత్తు ప్రశ్నార్థకం
చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 బరిలో దిగిన కోహ్లి ఏడు నెలల విరామం తర్వాత మళ్లీ ఆసీస్‌తో వన్డేతో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, పునరాగమనంలో ఇలా వరుసగా డకౌట్లు కావడం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. వన్డే వరల్డ్‌కప్-2027 ఆడాలని కోహ్లి పట్టుదలగా ఉండగా.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం ఇది కుదరదనే సంకేతాలు ఇచ్చాడు.
ఆసీస్‌తో వన్డే జట్టు ప్రకటన సందర్భంగా రోహిత్ శర్మ, కోహ్లి తమకు ఈ విషయమై హామీ ఇవ్వలేదని.. అందుకే రోహిత్‌ను వన్డే కెప్టెన్‌గా తొలగించినట్లు తెలిపాడు. కాగా రో- కో ఇప్పటికే పొట్టి ఫార్మాట్, టెస్టులకు గుడ్‌బై చెప్పి.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఇక ఆసీస్‌తో రెండో వన్డేలో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం.
చదవండి: 'లేటుగా ఎంట్రీ ఇచ్చా.. లేదంటే సచిన్‌ను మించిపోయేవాడిని'
End is very-very near guys, cherish each and every moment of Virat kohli in this tour.💔 pic.twitter.com/vgJ3Uy4rxO
— U' (@toxifyy18) October 23, 2025