ధోని, సచిన్‌ తర్వాతే.. గౌతమ్‌, సన్నీ లియోన్‌

Dhoni And Sachin Most Dangerous Of Search For Online Says McAfee - Sakshi

హైదరాబాద్‌: భారత క్రికెట్‌లో ఎంఎస్‌ ధోని, సచిన్‌ టెండూల్కర్‌లకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ తమ ఆటతోపాటు అంతకుమించి గొప్ప మనసుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ దిగ్గజాలకు సంబంధించిన సమాచారం కోసం ఫ్యాన్స్‌ ఇంటర్నెట్‌లో తెగ వెతుకుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఓ సమస్య వచ్చిపడింది. వీరికోసం ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేస్తున్నప్పుడు నకిలీ లింకులు దర్శనమిస్తున్నాయి. ఇంటర్నెట్‌ వాడకంపై అంతగా అవగాహన లేనివారు ఆ లింక్‌లపై క్లిక్‌ చేసి ప్రమాదంలో పడుతున్నారు. ధోని, సచిన్‌ల గురించి సెర్చ్‌ చేసినప్పుడు ఎక్కువగా మాలీసియస్‌ వెబ్‌సైట్లకు లింకులు రీడైరెక్ట్‌ అవుతున్నాయని తాజాగా ప్రముఖ యాంటీ వైరస్‌ సంస్థ మెకాఫీ వెల్లడించింది. 

‘నెటిజన్లు ఎక్కువగా క్రీడలు, సినిమాలు, టీవీ షోల గురించి వెతుకుతుంటారు. అంతేకాకుండా తాము అభిమానించే సెలబ్రెటీల ఫోటోలు, వీడియోలకోసం ఎక్కువగా సెర్చ్‌ చేస్తారు. ఇదే అదనుగా భావించిన సైబర్‌ నేరగాళ్లు నకిలీ లింక్‌లను క్రియేట్‌ చేసి వారిని ఆకర్షించేలా చేస్తున్నారు. అవి ఓపెన్‌ చేస్తే అశ్లీల, ప్రమాదకర వెబ్‌సైట్లు ఓపెన్‌ అవుతాయి. ఇలా ఓపెన్‌ చేయడంతో కొన్ని సార్లు వారి మొబైల్‌/కంప్యూటర్‌ వైరస్‌/హ్యాక్‌కు గురవుతున్నాయి. దీంతో నెటిజన్లు జాగ్రత్తగా ఉండాలి’ అని మెకాఫీ వివరించింది. అయితే మెకాఫీ రూపోందించిన జాబితా ప్రకారం ప్రమాదకరమైన సెలబ్రెటీల జాబితాలో ఓవరాల్‌గా ధోని, సచిన్‌లు అగ్రస్థానంలో ఉన్నారు. వీరి తర్వాత హిందీ బిగ్‌బాస్‌-8 విన్నర్‌ గౌతమ్ గులాటీ, బాలీవుడ్‌ బోల్డ్‌ నటి సన్నీ లియోన్‌, రాధికా ఆప్టే, శ్రధ్దా కపూర్‌, పీవీ సింధు, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, క్రిస్టియానో రొనాల్డోలు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top