ధోని ఎక్కువగా సలహాలు ఇవ్వడు : చహర్‌

Deepak Chahar Says Dhoni Does Not Tell Much But Gives Key Inputs In Crucial Times - Sakshi

‘మైదానం లోపల, వెలుపల మ్యాచ్‌ గురించి చాలా చర్చిస్తాం. ధోని ఎక్కువ సలహాలు ఇవ్వడు. కానీ అత్యవసర సమయాల్లో, విజయానికి దోహదపడే అంశాల గురించి తప్పక విలువైన సూచనలు చేస్తాడు. ఈరోజు కూడా అంతే. మ్యాచ్‌ ఫైనల్‌ ఓవర్లో ధోని నా దగ్గరికి వచ్చాడు. సిక్సులు, ఫోర్లు ఇచ్చినా సరేగానీ ఒక్క సింగిల్‌ కూడా తీసే అవకాశం ఇవ్వొద్దని చెప్పాడు. తద్వారా నాన్‌ స్ట్రైక్‌లో ఉన్న రస్సెల్‌కు అవకాశం లేకుండా చేయాలన్నదే మా ప్లాన్‌ అని మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దీపక్‌ చహర్‌ తమ కెప్టెన్‌ ధోని ప్రణాళికల గురించి చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌ 2019లో భాగంగా మంగళవారం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాను నిర్ణీత 20 ఓవర్లలో 108 పరుగులకే కట్టడి చేసి చెన్నై బౌలర్లు తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ముఖ్యంగా యువ బౌలర్‌ దీపక్‌ చహర్‌ ఓవర్‌కు ఒక వికెట్‌ చొప్పున క్రిస్‌ లిన్‌ (0), నితీశ్‌ రాణా (0), రాబిన్‌ ఉతప్ప (11)లను పెవిలియన్‌కు చేర్చి కోల్‌కతా టాప్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఇక డెత్‌ ఓవర్‌లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న చహర్‌.. కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి కోల్‌కతా హిట్టర్‌ ఆండ్రీ రసెల్‌ను కట్టడి చేశాడు. తద్వారా ప్రత్యర్థి జట్టును స్వల్ప స్కోరుకే పరిమితం చేయడంలో ప్రధాన పాత్ర పోషించి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కించుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘ వికెట్‌ చాలా స్లోగా ఉందని తెలిసి స్ట్రెయిట్‌ బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నా. ఇన్‌స్వింగ్‌, అవుట్‌స్వింగ్‌ ఏదైనా సరే స్టంప్స్‌ను కూల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నా. చివరి ఓవర్లో ధోని విలువైన సలహాలతో ప్రత్యర్థి జట్టును కట్టడి చేశా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక శనివారం చెపాక్‌ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా నోబాల్స్‌ వేసిన చహర్‌పై ధోని గుస్సా అయిన సంగతి తెలిసిందే. ధోని సలహా తర్వాత చహర్ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన ఆఖరు బంతికి కీలక బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మిల్లర్‌ను ఔట్‌ చేశాడు కూడా.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top