డి కాక్, అండర్సన్‌లకు భారీ డిమాండ్ | de knock ,Corey Anderson Huge demand | Sakshi
Sakshi News home page

డి కాక్, అండర్సన్‌లకు భారీ డిమాండ్

Jan 4 2014 1:02 AM | Updated on Sep 2 2017 2:15 AM

డి కాక్,   కోరీ అండర్సన్

డి కాక్, కోరీ అండర్సన్

సంచలన ఆట తీరుతో చెలరేగుతున్న క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా), కోరీ అండర్సన్ (న్యూజిలాండ్)లకు ఐపీఎల్-7 వేలంలో భారీ డిమాండ్ ఏర్పడే అవకాశాలున్నాయి.

 న్యూఢిల్లీ: సంచలన ఆట తీరుతో చెలరేగుతున్న క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా), కోరీ అండర్సన్ (న్యూజిలాండ్)లకు ఐపీఎల్-7 వేలంలో భారీ డిమాండ్ ఏర్పడే అవకాశాలున్నాయి. వచ్చే నెలలో జరగనున్న వేలం పాటలో వీరిద్దరి కోసం పెద్ద మొత్తాన్ని వెచ్చించేందుకు అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి.
 
 ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన డి కాక్.. వికెట్ కీపింగ్ కూడా చేస్తుండటం అతని అవకాశాలను రెట్టింపు చేసింది. ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇతనిపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నాయి. మరోవైపు వన్డేల్లో 36 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అండర్సన్‌పై కూడా అందరి దృష్టి నెలకొంది. గతేడాది ఐపీఎల్‌కు ముందు రిచర్డ్ లెవీ (దక్షిణాఫ్రికా)... కివీస్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో 45 బంతుల్లోనే సెంచరీ చేసి ఒక్కసారిగా హాట్‌కేకులా మారాడు. అప్పట్లో వేలం లేకపోవడంతో లీగ్‌కు ముందు ముంబై ఇండియన్స్ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈసారి వేలం జరుగుతుండటంతో అండర్సన్ కోసం గట్టి పోటీ నెలకొంది.
 
 సెహ్వాగ్‌ను కొనసాగిస్తారా?
 ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్న  సెహ్వాగ్‌ను ఢిల్లీ ఫ్రాంచైజీ ‘కొనసాగించే’ అవకాశాలు కనబడటం లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఐకాన్ హోదాలో అతను ఢిల్లీకి ఆడుతున్నాడు. కానీ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా వీరూని వేలంలోకి పంపించాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. ‘సెహ్వాగ్‌ను కొనసాగిస్తే దాదాపు రూ. 12.5 కోట్లు లేదా రూ. 9.5 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. మాకు ఉన్న రూ. 60 కోట్లతో జట్టు మొత్తాన్ని తాజాగా కొనుగోలు చేయాలి.
 
 కాబట్టి ఇద్దరి కంటే ఎక్కువ మందిని కొనసాగిస్తే దీనిపై ప్రభావం పడుతోంది. వార్నర్‌ను కొనసాగించడం ఓ రకంగా మంచిదే’ అని ఫ్రాంచైజీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఏదేమైనా సెహ్వాగ్ భవితవ్యం... జట్టు కోచ్ కిర్‌స్టెన్ నిర్ణయంపై ఆధారపడి ఉంది.
 
 ఐపీఎల్ రెండు దశల్లో
 భారతదేశంలో సాధారణ ఎన్నికల కారణంగా ఐపీఎల్ తేదీల విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఒకవేళ ఎన్నికల సమయంలో మ్యాచ్‌లు ఉంటే... టోర్నీని రెండు దశల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఎన్నికల సమయంలో మ్యాచ్‌లను వేరే ఏదైనా దేశంలో (దక్షిణాఫ్రికా లేదా శ్రీలంక పేర్లు పరిశీలనలో ఉన్నాయి) నిర్వహించాలని అనుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement