సేమ్‌ డే.. సేమ్‌ ఫీట్‌

On This Day, Ponting And Cook Completes 10000 Test Runs - Sakshi

సచిన్‌ రికార్డు బద్ధలైన వేళ..

లండన్‌: ప్రపంచ క్రికెట్‌లో రికీ పాంటింగ్‌, అలెస్టర్‌ కుక్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా పాంటింగ్‌ జట్టుకు ఎన్నో చిరస‍్మరణీయమైన విజయాలను అందిస్తే, ఇంగ్లండ్‌ సారథిగా అలెస్టర్‌ కుక్‌ అనేక గెలుపులను చూశాడు.  వీరిద్దరూ బ్యాటింగ్‌లో కూడా ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకుని దిగ్గజ క్రికెటర్‌లుగా నిలిచారు.. అందులో 10వేల టెస్టు పరుగుల మార్కు ఒకటి. అయితే ఈ ఫీట్‌ను 2008లో పాంటింగ్‌ సాధిస్తే, 2016లో కుక్‌ నమోదు చేశాడు. కాగా, ఈ సేమ్‌ ఫీట్‌ను వీరిద్దరూ ఒకే రోజు(మే 30)నే నమోదు చేయడం ఇక్కడ విశేషం.  ఈ అరుదైన ఘనతను సాధించడానికి వీరిద్దర మధ్య కాల వ్యవధి ఎనిమిదేళ్లు. 10వేల పరుగుల మార్కును చేరిన 7వ బ్యాట్స్‌మన్‌గా పాంటింగ్‌  కాగా, కుక్‌ 12వ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. కాగా, ఈ ఘనతను సాధించిన పిన్న వయస్కుడిగా కుక్‌ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

2008లో పాంటింగ్‌ ఇలా..
ఆంటిగ్వాలోని నార్త్‌ సౌండ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో పాంటింగ్‌ 10 వేల మార్కును చేరాడు. విండీస్‌తో మ్యాచ్‌లో భాగంగా తొలి రోజు 61 పరుగులు సాధించడం ద్వారా పాంటింగ్‌ అరుదైన జాబితాలో చేరిపోయాడు. అప్పటివరకూ ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రమే 10 వేల పరుగుల రికార్డును చేరగా మూడో ఆసీస్‌ క్రికెటర్‌గా పాంటింగ్‌  నిలిచాడు.ఆసీస్‌ కెప్టెన్లుగా చేసిన అలెన్‌ బోర్డర్‌, స్టీవ్‌ వాల సరసన పాంటింగ్‌ చేరాడు. విండీస్‌ టెస్టు మ్యాచ్‌లో ఈ రికార్డును చేరిన కాసేపటికే పాంటింగ్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించి పాంటింగ్‌ పెవిలియన్‌ చేరాడు. 

సచిన్‌ రికార్డు బద్ధలైన వేళ..
2016లో చెస్టర్‌ లీ స్ట్రీట్‌లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కుక్‌ 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అప్పుడు లంకేయులతో జరిగిన రెండో టెస్టులో కుక్‌ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. అదే సమయంలో 10 వేల పరుగుల రికార్డును పిన్న వయసులో అందుకున్న క్రికెటర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. 31 ఏళ్ల ఐదు నెలల 7 రోజుల వయసులో కుక్‌ ఈ రికార్డు సాధించగా, సచిన్‌ 31 ఏళ్ల 10 నెలల 20 రోజుల వయసులో దీన్ని నమోదు చేశాడు.  2005లో కోల్‌కతాలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో సచిన్‌ 10 వేల మార్కును చేరుకున్నాడు. కాగా, 11 ఏళ్ల తర్వాత ఆ రికార్డును కుక్‌ బ్రేక్‌ చేసి నయా రికార్డు లిఖించాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top