వార్నర్‌ మరో‘మార్‌’ | Sakshi
Sakshi News home page

వార్నర్‌ మరో‘మార్‌’

Published Mon, Apr 8 2019 10:04 PM

David Warner Unbeaten 70 Help Sunrisers Post 150 Runs Against Punjab - Sakshi

మొహాలి: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(70 నాటౌట్‌; 62 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌) మరో సారి బాధ్యతాయుతంగా ఆడాడు. దీంతో సన్‌రైజర్స్‌ గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా సోమవారం కింగ్స్‌ పంజాబ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 151 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. బెయిర్‌ స్టో(1) వికెట్‌ త్వరగానే కోల్పోయింది. ఈ తరుణంలో విజయ్‌ శంకర్‌తో కలిసి, మరో ఓపెనర్‌ వార్నర్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే వికెట్ పడకుండా జాగ్రత్తతో మరీ నెమ్మదిగా ఆడారు. దీంతో పది ఓవర్లు ముగిసే​ సరికి కేవలం 50 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో బౌండరీల మాట పక్కకు పెడితే కనీసం పరుగులు తీయడానికి నానాతంటాలు పడ్డారు. ఈ తరుణంలో విజయ్‌ శంకర్‌(26) అశ్విన్‌ బౌలింగ్‌లో కీపర్‌ క్యాచ్‌గా అవుటయ్యాడు. 

అనూహ్యంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మహ్మద్‌ నబి(12) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. ఓ వైపు సహచర ఆటగాళ్లు సహకరించకున్నా వార్నర్‌ ఒంటరి పోరాటం చేశాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్‌ బోర్డు పెంచే ప్రయత్నం చేశాడు. మనీష్‌ పాండే(19)తో కలిసి అర్దసెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో మూడో వ్యక్తిగత హాఫ్‌ సెంచరీ సాధించాడు. చివర్లో దీపక్‌ హుడా 3 బంతుల్లో 14 పరుగులు చేయడంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో ముజీబ్‌, అశ్విన్‌, షమీలు తలో వికెట్‌ సాధించారు.

Advertisement
Advertisement