సన్‌రైజర్స్‌ ఫైనల్‌కు చేరేనా?

CSK, SRH look to seal final berth - Sakshi

ముంబై: ఐపీఎల్‌-11వ సీజన్‌లో మరో అంకానికి ఆరంభం. లీగ్‌ దశను విజయవంతంగా ముగించుకుని ప్లేఆఫ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు నాలుగు జట్లు సిద్ధమయ్యాయి. దీనిలో భాగంగా మంగళవారం నగరంలోని వాంఖేడే స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరుగనుంది. రేపు సాయంత్రం గం. 7.00లకు ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకుంటుంది. దాంతో ఇరు జట్లు తీవ్ర కసరత్తులు చేయడంతో పాటు తమ తమ వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. మరి తొలి ఫైనల్‌ బెర్తు అవకాశం దక్కేదెవరికో?

ఒకరిదేమో ఆధిపత్యం.. మరొకరిదేమో ప్రతీకారం.. ఇదీ తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో తలపడనున్న రెండు జట్ల పరిస్థితి. టేబుల్ టాపర్‌గా ఉన్న సన్‌రైజర్స్‌ను లీగ్‌ దశలో రెండు సార్లు మట్టికరిపించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడో విజయంతో మురిపించాలన్న ఉత్సాహంలో ఉండగా, ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారంతో లెక్కసరిచేయాలని సన్‌రైజర్స్‌ ఆశిస్తోంది. ఈ రెండు జట్లలో అటు సీనియర్‌ ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లు కూడా దుమ్ముదులుపుతున్నారు. బౌలర్లు కూడా సూపర్‌ ఫామ్‌తో చెలరేగిపోతున్నారు. మరొకవైపు ఫీల్డింగ్‌లోనూ రెండు జట్లు సమవుజ్జీలుగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. తొలి క్వాలిఫయర్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుండగా, ఓడిన జట్టుకు తుది పోరుకు అర్హత సాధించేందుకు ఎలిమినేటర్‌ మ్యాచ్‌ రూపంలో మరో అవకాశం ఉంటుంది.

రెండేళ్ల తర్వాత పునరాగమనం చేసిన చెన్నై జట్టు అన్ని రంగాల్లో ఆకట్టుకుంటూ 18 పాయింట్లతో ప్లేఆఫ్‌ రేసులో నిలిచింది. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అదే 18 పాయింట్లు సాధించి మెరుగైన రన్‌రేట్‌ టాప్‌ ప్లేస్‌ను ఆక్రమించింది. చెన్నై జట్టు బ్యాటింగ్‌లో అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోని, సురేశ్‌ రైనా, రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రేవోలు కీలకం కాగా, సన్‌రైజర్స్‌ జట్టు బ్యాటింగ్‌ విభాగంలో కేన్‌ విలియమ్సన్‌, శిఖర్‌ ధావన్‌, మనీష్‌ పాండే, శ్రీవాత్స్‌ గోస్వామి ప‍్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. బౌలింగ్‌ విభాగంలో చెన్నై కంటే సన్‌రైజర్స్‌ కాస్త మెరుగ్గా ఉంది. లీగ్‌ దశలో సన్‌రైజర్స్‌ వరుస విజయాల్లో బౌలర్లు ముఖ్య పాత్ర పోషించారు. అయితే చెన్నైపై రెండు మ్యాచ్‌ల్లో ఓటమి సన్‌రైజర్స్‌ను కలవరపరుస్తోంది. దాంతో చెన్నైకు ఏ రకంగా చెక్‌పెట్టాలనే దానిపై సన్‌రైజర్స్‌ నిమగ్నమైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top