వివరణ కోరనున్న సీఓఏ

CoA asks for Mithali Raj's tournament fitness - Sakshi

మిథాలీ తొలగింపు వివాదం

న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్లో మిథాలీ రాజ్‌ను ఆడించకుండా తప్పించిన వివాదంపై వివరణ కోరాలని క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. భారత జట్టు స్వదేశం తిరిగొచ్చిన తర్వాత దీనికి సంబంధించి మిథాలీ, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, కోచ్‌ రమేశ్‌ పొవార్, మేనేజర్‌ తృప్తి, సెలక్టర్‌ సుధ షాలతో సీఓఏ బృందం విడివిడిగా మాట్లాడనుంది. మరోవైపు ప్రపంచ కప్‌ సమయంలో మిథాలీ ఫిట్‌నెస్‌ ఎలా ఉందనే అంశంపై కూడా సీఓఏ వివరాలు కోరింది. దీనిపై జట్టు మేనేజర్‌ తృప్తి సోమవారం బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రికి నివేదిక ఇవ్వనుంది. మరోవైపు మిథాలీరాజ్‌ను తప్పించే క్రమంలో మ్యాచ్‌కు ముందు జరిగిన సమావేశం గురించి మీడియాలో రావడంపై కూడా సీఓఏ అసహనం వ్యక్తం చేసింది.  

నన్నూ తీసేశారు: గంగూలీ
మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో కూడా తుది జట్టు నుంచి కెప్టెన్లను తప్పించడం కొత్తేమీ కాదని భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. గతంలో తనకూ ఈ అనుభవం ఎదురైంది కాబట్టి మిథాలీ వ్యవహారం ఆశ్చర్యపరచలేదని అతను అన్నాడు. ‘ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను కూడా ఇలా ఇంటికి పంపించారు. అయినా మిథాలీని తప్పించడం కంటే భారత్‌ ఓడటమే నన్ను ఎక్కువగా బాధించింది’ అని గంగూలీ వ్యాఖానించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top