'కల్పన'లా... గెలవాలిలా...

'కల్పన'లా... గెలవాలిలా...


పదేళ్ల క్రితం... విజయవాడలోని కృష్ణానది ఒడ్డున ఉన్న ఒక పూరింట్లోకి వరద నీరు వేగంగా వచ్చి చేరుతోంది. ఓ మహిళ సామాన్లన్నీ చకచకా సర్దుతోంది. 9 ఏళ్ల చిన్న పిల్ల అక్కడే ఉంది. ‘ఇలా వచ్చి ఈ గిన్నె తీసుకోమ్మా’... అంటూ ఆ తల్లి పిలిచింది. ‘ఫర్లేదమ్మా విసిరెయ్... పట్టుకుంటా’ అని సమాధానం ఇచ్చింది ఆ పాప. ‘పడిపోతుందేమో’... తల్లి ఆందోళన చెందుతూనే విసిరింది. దూరంగా పడుతున్న ఆ గిన్నెను ఆ పాప చిరుతలా అందుకుంది.

 

కట్ చేస్తే... ప్రస్తుతం... భారత మహిళల క్రికెట్‌లో ఎలాంటి బంతినైనా ఒడిసిపట్టుకునే వికెట్ కీపర్ వచ్చేసింది. ఆంధ్ర క్రికెట్ నుంచి తొలిసారి ఓ అమ్మాయి జాతీయ జట్టుకు ఎంపికైంది. 19 ఏళ్ల ఆ అమ్మాయి పేరు రావి కల్పన. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం... తండ్రి ప్రతిరోజూ కూలికి వెళితే గానీ ఐదు వేళ్లూ లోపలకి వెళ్లని నేపథ్యం... అయినా కల్పన తన క్రమశిక్షణ, పట్టుదలతో అత్యున్నత స్థాయికి ఎదిగింది. హ్యాట్సాఫ్... కల్పన..!


 

‘భారత జట్టుకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఏడేళ్ల క్రితం వరదలు వచ్చి బస్టాండ్‌లో(పునరావాస కేంద్రంలో) తలదాచుకున్నప్పుడు... ఇలా ఓ క్రికెటర్‌ని అవుతాననే ఊహ కూడా లేదు. కోచ్‌లు ఈశ్వర్, శంకర్, శ్రీనివాసరెడ్డి, చిరంజీవి, బాపిరాజు అందరూ నాకు సహాయపడ్డారు. ఉమెన్ క్రికెట్ అకాడమీలో కోచ్ శ్రీనివాస్ రెడ్డితో పాటు మారియా పాహే (న్యూజి లాండ్)లు ప్రత్యేక శ్రద్ధతో కోచింగ్ ఇచ్చారు. ఇక ఆంధ్ర క్రికెట్ సంఘం ప్రోత్సాహం లేకపోతే నేను లేను.ఉచిత విద్యతో పాటు ప్రతి నెలా నాలుగు వేల రూపాయలు ఉపకార వేతనం ఇచ్చారు. టోర్నీల్లో గెలిచినప్పుడు ప్రోత్సాహకాలు ఇచ్చారు. అప్పులు తీర్చుకున్నాం. నేను క్రికెట్ ఆడతా అంటే మా అమ్మానాన్న ఒక్కసారి కూడా ‘ఎందుకు’ అని అడ్డు చెప్పలేదు. ఎన్ని కష్టాలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నాన్న నాకు కావలసినవి అన్నీ కొనిచ్చారు. ఇన్నాళ్లకి మా కష్టానికి ప్రతిఫలం లభించింది.’

 - కల్పన


 

ఏ క్రీడాకారుడికైనా దేశం తరఫున ఆడాలనేది కల. దానిని సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడతుంటారు. కొంతమందికి అన్ని సౌకర్యాలు ఉన్నా అనుకున్నది సాధించలేరు. కానీ రావి కల్పన మాత్రం 19 ఏళ్ల వయసులోనే భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైంది. న్యూజిలాండ్‌తో బెంగళూరులో జూన్ 28 నుంచి జులై 8 వరకు జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో  తొలిసారి భారత్ తరఫున ఆడబోతోంది. ప్రకాశం జిల్లా నుంచి పొట్టకూటి కోసం 16 ఏళ్ల క్రితం విజయవాడ వలస వచ్చిన ఓ కుటుంబం... వానొస్తే, వరదొస్తుందేమో అని భయపడ్డ ఓ కుటుంబం... అండగా నిలబడాల్సిన కుమారుడికి అంగవైకల్యం, కష్టాలతో కాపురం చేసిన కుటుంబం... ఇవాళ భారత జట్టుకు ఒక క్రికెటర్‌ను అందించింది.

 

గుర్తించిన రవికాంతి, రమేశ్

2008-09 సీజన్‌లో గుంటూరులో బీసీసీఐ మహిళా క్రికెట్ అకాడమీని ప్రారంభించింది. దీనికోసం క్రీడాకారిణులను ఎంపిక చేయాలని భావించారు. అప్పుడు కల్పన... బిషప్ అజరయ్య (సీఎస్‌ఐ మిషనరీ చర్చి) బాలికల హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. వయసు 13 ఏళ్లు. స్కూల్ పక్కనే ఉన్న మున్సిపల్ స్టేడియంలో సెలక్షన్స్ జరుగుతోంటే కల్పన వెళ్లింది. కల్పన ఫిట్‌నెస్, చురుకుదనాన్ని రవికాంతి (కృష్ణాజిల్లా సంఘం మహిళా కో ఆర్డినేటర్), కోకా రమేశ్ (సెంట్రల్ జోన్ కార్యదర్శి) గుర్తించారు. ఆమెను అకాడమీలోకి తీసుకున్నారు.అంతే... కల్పన జీవితం పెద్ద మలుపు తిరిగింది. ఎంతసేపు ప్రాక్టీస్ చేసినా తను అలసిపోయేది కాదు. దీంతో కోచ్‌లు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి శిక్షణ ఇచ్చారు. 2009లో క్రికెట్‌లో చేరింది.  ఏడాదిలోనే ఆంధ్ర క్రికెట్ సంఘం అండర్-16 జట్టుకు ఎంపికయ్యింది. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు.  అండర్-19, సీనియర్స్ అన్ని జట్లలోనూ ఆడింది. తను ఆడిన ఏ టోర్నీలో అయినా తనే ఉత్తమ వికెట్ కీపర్. బీసీసీఐ ప్రతి ఏటా నిర్వహించే చాలెంజర్స్ ట్రోఫీలో 2012 నుంచి 2015 వరకు ప్రతి ఏడాదీ తనే ఉత్తమ వికెట్ కీపర్. దీంతో భారత జట్టులోకి ఎంపికైంది. ప్రస్తుతం కల్పన నలంద కళాశాలలో డిగ్రీ చదువుతోంది.    - ఆలూరి రాజ్‌కుమార్  

- (సాక్షి స్పోర్ట్స్, విజయవాడ)

 

నాన్నకు సలామ్

ప్రకాశం జిల్లా హెచ్.ఎం.పాడు మండలంలోని పెద్ద దాసళ్ల పల్లె గ్రామం నుంచి కల్పన కుటుంబం బతుకుదెరువు కోసం విజయవాడకు వలస వచ్చింది. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు ముఠా కూలీగా పనికి చేరాడు. తల్లి బాల కోటేశ్వరి ఇంట్లోనే ఉండేది. కల్పన అన్నయ్య రవి పోలియో కారణంగా నడవలేడు. చెల్లి కావ్య మరీ చిన్నది. చాలా వలస కుటుంబాల్లాగే వెంకటేశ్వర్లు కూడా కృష్ణలంక కరకట్ట మీద కృష్ణా నది ఒడ్డున ఒక పూరిల్లు అద్దెకు తీసుకుని బతుకు బండిని ఈడ్చేవాడు. కృష్ణానదికి ఎప్పుడు వరద వచ్చినా ఇంట్లోకి నీళ్లొచ్చేవి. వెంటనే ఖాళీ చేసి మూటా ముల్లె సర్దుకుని వెళ్లిపోవాలి.బస్టాండ్ దగ్గరో, మున్సిపల్ స్టేడియంలోనే ఆశ్రయం తీసుకోవాలి. మళ్లీ వరద తగ్గాక వచ్చి ఆ పూరింటినే బాగు చేసుకుని ఉండాలి. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు. కూలికి వెళితే తప్ప పూట గడవని స్థితి. అయినా వెంకటేశ్వర్లు ఎప్పుడూ బాధ పడలేదు. తన పిల్లలే తన జీవితం అనుకున్నాడు. క్రమంగా వయసు మీద పడుతుండటంతో కూలీగా పని చేయలేనని అర్థమైంది. అప్పటి ఓనర్ల సహకారంతో ఒక ట్రాలీ ఆటో కొనుక్కున్నాడు. ఆ తర్వాత క్రమంగా దానిని పాసింజర్ ఆటోగా మార్చుకున్నాడు.వానొచ్చినా, ఎండ మండినా విజయవాడలో రోజూ ఆటోలో తిరగాల్సిందే. అయినా ఎప్పుడూ ఆయన చిరునవ్వుతోనే ఉండేవాడు. ఇప్పటికీ ఈ కుటుంబానికి ప్రధాన ఆధారం ఆ ఆటోనే. ఇలాంటి ఆర్థిక నేపథ్యం ఉన్న కుటుంబాల్లో పిల్లల్ని చదివించడమే గొప్ప. అలాంటిది క్రికెట్ ఆడతానంటే ప్రోత్సహించాడు. ప్రాక్టీస్‌కు తన ఆటోలోనే తీసుకెళ్లి దించేవాడు. ఇవ్వాళ ఆ తండ్రి శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. కూతురు భారత క్రికెట్ జట్టుకు ఎంపికైనప్పుడు ఆ తండ్రి సంతోషాన్ని మనం వర్ణించగలమా..!

 

అందరి పిల్లల మాదిరిగా  క్రికెట్ అంటే ఇష్టపడింది అనుకున్నాను.  ఎప్పుడూ బాగా ఆడుతుందని తెలుసు. ఈ స్థాయికి వస్తుందని ఏనాడూ కలలో కూడా ఊహించలేదు. చిన్నతనం నుంచే నాకు చేదోడు వాదోడుగా ఉంటూ బాధ్యతగా ప్రవర్తించేది. చాలా సంతోషంగా ఉంది.

 -వెంకటేశ్వర్లు (కల్పన తండ్రి)

 

కల్పన చాలా క్రమశిక్షణతో ఉంటుంది. ఎంతసేపు ప్రాక్టీస్ చేసినా అలసిపోదు. కోచ్ చెప్పింది తు.చ. తప్పకుండా పాటిస్తుంది. ఆట మీద ప్రేమ, సాధించాలనే తపన  వల్లే భారత జట్టుకు ఎంపికైంది

 - బీసీసీఐ ఉమెన్ అకాడమీ కోచ్ ఎస్. శ్రీనివాస్‌రెడ్డి

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top