
డ్రా కోసం పోరాటం!
ప్రత్యర్థి భారీస్కోరు చేసినప్పుడు తొలుత మనం కూడా ఆ స్కోరును చేరడం ముఖ్యం.
ఆత్మరక్షణ ధోరణిలో కోహ్లి సేన
పుజారా, విజయ్ సెంచరీలు
తొలి ఇన్నింగ్స్ భారత్ 319/4
ఓ వైపు తండ్రి ఆనంద భాష్పాలు... మరోవైపు భార్య మోములో చిరునవ్వులు... ఇంకోపక్క స్నేహితులు, బంధువుల సంబరాలు... ఓ క్రికెటర్ తన సొంతగడ్డపై సెంచరీ చేస్తే లభించే ఆనందమే వేరు. ఈ చిరస్మరణీయ క్షణాలను ఆస్వాదించాడు చతేశ్వర్ పుజారా. తన సొంత నగరం రాజ్‌కోట్‌లో మొట్టమొదటిసారి జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో అద్వితీయమైన ఆటతీరుతో సెంచరీ చేశాడు. తనకు తోడు మురళీ విజయ్ కూడా పోరాటపటిమతో సెంచరీ చేశాడు. దీంతో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు మూడో రోజును భారత్ గౌరవప్రదంగా ముగించింది.
ఎదురుగా ప్రత్యర్థి చేసిన భారీస్కోరు. ఏ మాత్రం తొందరపడ్డా వికెట్లు పడితే మ్యాచ్ చేజారుతుంది. పిచ్‌ను చూస్తే పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు. కాబట్టి ఈ మ్యాచ్‌లో గెలవడం కష్టం. కనీసం డ్రా చేసుకుంటే చాలు... బహుశా భారత జట్టు ఆలోచన ఇలాగే ఉందేమో. మూడో రోజు ఆటలో మన బ్యాట్స్‌మెన్ పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలో ఆడారు. ఇంగ్లండ్ బౌలర్ల క్రమశిక్షణను పరిగణలోకి తీసుకుంటే భారత ఆటగాళ్లు విజయ్, పుజారా బాగా పోరాడినట్లే. ఏమైనా ప్రస్తుతానికి కూడా కాస్తో కూస్తో ఇంగ్లండ్‌దే పైచేరుుగా కనిపిస్తోంది. ప్రస్తుతం 218 పరుగులు వెనకబడి ఉన్న దశలో ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మాత్రం అద్భుతమే జరగాలి. అరుుతే అంతకంటే ముందు నిర్లక్ష్యానికి తావివ్వకుండా మరో రోజు బ్యాట్స్‌మెన్ పోరాడాలి. లేకపోతే మొదటికే మోసం రావచ్చు.
రాజ్‌కోట్: భారత పర్యటనలో ఊహించిన దానికంటే ఇంగ్లండ్ బాగా ఆడుతోంది. తొలుత బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించి భారీస్కోరు అందిస్తే... బౌలర్లు కూడా క్రమశిక్షణతో పోరాడుతున్నారు. మూడో రోజు ఆటలో నాలుగు వికెట్లే తీసినా... పరుగులు రాకుండా కచ్చితమైన లెంగ్‌తతో బంతులు వేసి భారత బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టారు. నిజానికి విజయ్, పుజారా ఇద్దరూ టెస్టు స్పెషలిస్ట్‌లు కాబట్టి సరిపోరుుంది... లేకపోతే పరిస్థితి ఇంకోలా ఉండేది. మొత్తం మీద ఇంగ్లండ్ మూడో రోజు చివరి దశలో వికెట్లతో తొలి ఇన్నింగ్‌స ఆధిక్యంపై ఆశపెట్టుకుంది.
సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్‌సలో 108.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఓపెనర్ మురళీ విజయ్ (301 బంతుల్లో 126; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), చతేశ్వర్ పుజారా (206 బంతుల్లో 124; 17 ఫోర్లు) సెంచరీలు చేశారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 209 పరుగులు జోడించడం విశేషం. ఆట ముగిసే సమయానికి కెప్టెన్ విరాట్ కోహ్లి (70 బంతుల్లో 26 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, అన్సారీ, రషీద్, స్టోక్స్ ఒక్కో వికెట్ తీశారు. భారత్ ప్రస్తుతం తొలి ఇన్నింగ్‌సలో 218 పరుగులు వెనకబడి ఉంది. చేతిలో ఆరు వికెట్లు ఉన్నారుు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది.
సెషన్ 1: ఆరంభంలోనే వికెట్
మూడో రోజు రెండో ఓవర్‌లోనే భారత్‌కు షాక్ తగిలింది. గంభీర్ (29) బ్రాడ్ బౌలింగ్‌లో ఎల్బీగా అవుటయ్యాడు. అప్పటికి విజయ్ 25 పరుగులతో ఆడుతున్నాడు. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన ‘లోకల్ బోయ్’ పుజారా ఆరంభం నుంచి నాణ్యమైన క్రికెట్ ఆడాడు. తను ఆడిన మూడో బంతినే బౌండరీకి పంపిన పుజారా... నాలుగు ఓవర్ల వ్యవధిలో మరో నాలుగు ఫోర్లు కొట్టాడు. అన్సారీ బౌలింగ్‌లో ఓ సిక్సర్ కొట్టిన విజయ్... స్ట్రరుుక్ రొటేట్ చేయడంలో విఫలమయ్యాడు. పుజారా అడపాదడపా బౌండరీలతో స్వేచ్ఛగా ఆడాడు. అన్సారీ బౌలింగ్‌లో సిక్సర్‌తో విజయ్ 129 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో పుజారా 74 బంతుల్లో అర్ధసెంచరీ మార్కును చేరాడు. స్టోక్స్ వేసిన ఒకే ఓవర్లో పుజారా మూడు ఫోర్లు కొట్టడం విశేషం. గంభీర్ వికెట్ పడటం మినహా ఈ సెషన్‌లో భారత్ జోడీ బాగా ఆడింది.
ఓవర్లు: 27 పరుగులు: 99 వికెట్లు: 1
సెషన్ 2: నత్తనడకన పరుగులు
లంచ్ తర్వాత భారత జోడీ బాగా నెమ్మదిగా ఆడింది. ఏడు ఓవర్ల వరకు ఒక్క ఫోర్ మాత్రమే వచ్చింది. పుజారా ఆ తర్వాత కాస్త వేగం పెంచినా విజయ్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా పేసర్ వోక్స్ చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. 66 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విజయ్ ఇచ్చిన క్యాచ్‌ను హమీద్ వదిలేశాడు. ఆ తర్వాత కూడా విజయ్ ఆటతీరులో మార్పు రాలేదు. ఒక దశలో ఓవర్‌కు ఒక సింగిల్ వచ్చినా చాలనేలా పరిస్థితి కనిపించింది. 86 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పుజారా... అన్సారీ బౌలింగ్‌లో ఎల్బీగా అవుటైనట్లు అంపైర్ ప్రకటించారు. అరుుతే పుజారా దీనిని రివ్యూ చేయగా... బంతి వికెట్ల పై నుంచి వెళుతున్నట్లు కనిపించింది. దీంతో తిరిగి నాటౌట్‌గా ప్రకటించారు. 99 పరుగుల స్కోరు వద్ద పుజారా ఎనిమిది బంతులు ఆడినా పరుగు రాలేదు. దీంతో తను అదే స్కోరు వద్ద టీ విరామానికి వెళ్లాడు. ఈ సెషన్‌లో ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో... భారత బ్యాట్స్‌మెన్ నత్తనడకన ఇన్నింగ్‌సను నడిపించారు.
ఓవర్లు: 29 పరుగులు: 66 వికెట్లు: 0
సెషన్ 3: చివర్లో వికెట్లు
టీ విరామం తర్వాత ఇంగ్లండ్ కొత్త బంతి తీసుకుంది. వోక్స్ బౌలింగ్‌లో సింగిల్‌తో పుజారా 169 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత విజయ్ మూడు ఓవర్ల వ్యవధిలో ఒక సిక్సర్, మూడు ఫోర్లు కొట్టి 254 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్నాడు. ఈ ఇద్దరి జోడీ నెమ్మదిగా అరుునా కుదురుగా ఆడుతున్న దశలో స్టోక్స్ ఇంగ్లండ్‌కు బ్రేక్ ఇచ్చాడు. వైడ్ స్లిప్‌లో ఉన్న కుక్‌కు క్యాచ్ ఇచ్చి పుజారా అవుటయ్యాడు. విజయ్‌తో జత కలిసిన కోహ్లి కూడా ఆచితూచి ఆడాడు. తను కుదురుకున్నాక క్రమంగా కోహ్లితో పాటు విజయ్ కూడా కాస్త జోరు పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విజయ్... మొరుున్ బౌలింగ్‌లో ఆకర్షణీయమైన సిక్సర్ కొట్టాడు. మరో ఐదు ఓవర్లలో రోజు ముగుస్తుందనగా... రషీద్ బౌలింగ్‌లో విజయ్ అవుటయ్యాడు. బంతి అదనంగా బౌన్‌స కావడంతో షార్ట్ లెగ్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో ‘నైట్ వాచ్‌మన్’గా స్పిన్నర్ అమిత్ మిశ్రా క్రీజులోకి వచ్చాడు. అరుుతే అన్సారీ బౌలింగ్‌లో తను ఆడిన రెండో బంతికే షార్ట్‌లెగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో అంపైర్లు రోజును ముగించారు. సెషన్ చివర్లో రెండు వికెట్లు కోల్పోకపోతే ఈ సెషన్‌లో కూడా భారత్‌ది పూర్తి ఆధిపత్యం ఉండేది.
ఓవర్లు: 29.3 పరుగులు: 91 వికెట్లు: 3
ప్రత్యర్థి భారీస్కోరు చేసినప్పుడు తొలుత మనం కూడా ఆ స్కోరును చేరడం ముఖ్యం. నాలుగో రోజు ఉదయం నుంచి బంతి బాగా తిరుగుందని అనుకుంటున్నాం. ఆఖరి రోజు బ్యాటింగ్ చేయడం బాగా కష్టం. కాబట్టి మేం శనివారం తొలి ఇన్నింగ్‌స ఆధిక్యం సాధించగలిగితే మాకు అవకాశాలు ఉంటారుు. సొంతగడ్డపై స్నేహితులు, బంధువుల మధ్య సెంచరీ చేయడం మరచిపోలేని అనుభూతి. ఈ మైదానంలో నేను రంజీ మ్యాచ్‌ల్లో బాగా ఆడాను. ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసి ఉంటే జట్టుకు మరింత ఉపయోగకరంగా ఉండేది. - పుజారా
► 1 విజయ్, పుజారా కలిసి ఇప్పటివరకూ టెస్టుల్లో 2,081 పరుగులు జోడిం చారు. సగటు పరంగా (65.03) భారత్‌కు ఈ ఇద్దరే అత్యుత్తమ జోడీ.
► 6 భారత్‌లో ఒకే టెస్టు తొలి రెండు ఇన్నింగ్‌సలో ఐదు సెంచరీలు నమోదు కావడం ఇది ఆరోసారి.
► 2 విజయ్, పుజారా 200 పైచిలుకు భాగస్వామ్యం నిర్మించడం ఇది రెండోసారి. గతంలో ద్రవిడ్, సెహ్వాగ్ మూడుసార్లు... ద్రవిడ్, గంభీర్ రెండుసార్లు డబుల్ సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేశారు.