‘పంజా’బ్‌ బలం సరిపోలేదు

Chennai beat Punjab by five wickets in final league game - Sakshi

లీగ్‌ దశలోనే కింగ్స్‌ ఎలెవన్‌ ఔట్‌

ప్లే ఆఫ్స్‌కు రాజస్తాన్‌ అర్హత

చివరి మ్యాచ్‌లో 5 వికెట్లతో చెన్నై విజయం

ఇన్‌గిడికి 4 వికెట్లు   

ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు నిరాశ తప్పలేదు. లీగ్‌ ఆరంభంలో వరుస విజయాలతో టాప్‌గా దూసుకుపోయినా... తర్వాతి దశలో ఓటములను ఆహ్వానించిన ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ముందుకు వెళ్లాలంటే చెన్నైని కనీసం 53 పరుగుల తేడాతో ఓడించాల్సిన స్థితిలో బరిలోకి దిగిన పంజాబ్‌ చివరకు ఓటమితోనే సరిపెట్టుకుంది. ఇన్‌గిడి అద్భుత బౌలింగ్‌తో తక్కువ స్కోరుకే పరిమితమైన టీమ్‌... చెన్నై బ్యాటింగ్‌ను 100 పరుగులలోపు నిలువరించడంలో విఫలమైంది. ఫలితంగా ప్లే ఆఫ్స్‌లోకి అడుగు పెట్టి జైపూర్‌లో రాజస్తాన్‌ సంబరాలు చేసుకుంది. ఐపీఎల్‌–11లో టాప్‌–4లో నిలిచిన నాలుగు జట్లూ మాజీ చాంపియన్లే కావడం విశేషం.   

పుణే: ఐపీఎల్‌–2018 లీగ్‌ దశకు ఏకపక్ష విజయంతో ముగింపు లభించింది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్లతో పంజాబ్‌ను చిత్తు చేసింది. ముందుగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 19.4 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. కరుణ్‌ నాయర్‌ (26 బంతుల్లో 54; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా, తివారి (30 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. అత్యుత్తమ బౌలింగ్‌తో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇన్‌గిడి (4/10) ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. అనంతరం చెన్నై సూపర్‌ కింగ్స్‌ 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. రైనా (48 బంతుల్లో 61 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనూహ్యంగా బ్యాటింగ్‌ అవకాశం లభించిన దీపక్‌ చహర్‌ (20 బంతుల్లో 39; 1 ఫోర్, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు.  

నాయర్‌ మెరుపులు...
నాలుగు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ స్కోరు 16/3... ఈ సీజన్‌లో రాహుల్‌ (7) తొలిసారి ‘సింగిల్‌ డిజిట్‌’కే పరిమితమయ్యాడు. ఇన్‌గిడి బంతి కి అతను చేతులెత్తేసి వెనుదిరిగాడు. అంతకుముందే ఇన్‌గిడి బంతికి కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి గేల్‌ (0) డకౌటయ్యాడు. రైనా అద్భుత క్యాచ్‌కు ఫించ్‌ (4) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ స్థితిలో తివారి, మిల్లర్‌ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే జడేజా తన తొలి బంతికే తివారిని ఔట్‌ చేయగా, చక్కటి యార్కర్‌తో మిల్లర్‌ను బ్రేవో పడగొట్టాడు. ఆ తర్వాత పంజాబ్‌ ఇన్నింగ్స్‌ భారం మొత్తం కరుణ్‌ నాయర్‌ మోశాడు.  శార్దుల్‌ ఓవర్లో వరుస బంతుల్లో నాయర్‌ 4, 6, 4 బాదాడు. ఆ తర్వాత బ్రేవో ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టి 25 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న నాయర్‌... మరుసటి బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించి డగౌట్‌ చేరాడు. మరో ఎండ్‌లో ఇతర బ్యాట్స్‌మెన్‌ ప్రభావం చూపలేకపోయారు.

ఆడుతూ పాడుతూ...
సాధారణ లక్ష్య ఛేదనలో చెన్నై కూడా ఆరంభంలోనే రాయుడు (1) వికెట్‌ కోల్పోయింది. ఈ సీజన్‌లో అతను ఒక అంకె స్కోరుకే పరిమితం కావడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత రాజ్‌పుత్‌ వరుస బంతుల్లో డు ప్లెసిస్‌ (14), బిల్లింగ్స్‌ (0)లను ఔట్‌ చేసి పంజాబ్‌ శిబిరంలో ఆశలు పెంచాడు. ఈ దశలో ఒక వైపు రైనా ప్రశాంతంగా ఆడుతుండగా, మరోవైపు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో చెన్నై తమ నిర్ణయాలతో ఆశ్చర్యపరచింది. హర్భజన్, దీపక్‌ చహర్‌లను ధోని, బ్రేవోలకంటే ముందు పంపించింది. వీరిద్దరు ఔటయ్యాక రైనా, ధోని (7 బంతుల్లో 16 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) దూకుడుగా ఆడి చెన్నై విజయాన్ని ఖాయం చేశారు.

స్కోరు వివరాలు
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బి) ఇన్‌గిడి 7; గేల్‌ (సి) ధోని (బి) ఇన్‌గిడి 0; ఫించ్‌ (సి) రైనా (బి) చహర్‌ 4; తివారి (సి) ధోని (బి) జడేజా 35; మిల్లర్‌ (బి) బ్రేవో 24; కరుణ్‌ నాయర్‌ (సి) చహర్‌ (బి) బ్రేవో 54; అక్షర్‌ (సి) బిల్లింగ్స్‌ (బి) శార్దుల్‌ 14; అశ్విన్‌ (సి) ధోని (బి) ఇన్‌గిడి 0; టై (సి) రైనా (బి) ఇన్‌గిడి 0; మోహిత్‌ శర్మ నాటౌట్‌ 2; రాజ్‌పుత్‌ (సి) డు ప్లెసిస్‌ (బి) శార్దుల్‌ 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 153.

వికెట్ల పతనం: 1–7, 2–14, 3–16, 4–76, 5–80, 6–116, 7–132, 8–132, 9–150, 10–153. బౌలింగ్‌: చహర్‌ 4–0–30–1, ఇన్‌గిడి 4–1–10–4, హర్భజన్‌ 1–0–13–0, శార్దుల్‌ 3.4–0–33–2, బ్రేవో 4–0–39–2, జడేజా 3–0–23–1.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రాయుడు (సి) రాహుల్‌ (బి) మోహిత్‌ 1; డు ప్లెసిస్‌ (సి) గేల్‌ (బి) రాజ్‌పుత్‌ 14; రైనా నాటౌట్‌ 61; బిల్లింగ్స్‌ (బి) రాజ్‌పుత్‌ 0; హర్భజన్‌ ఎల్బీడబ్ల్యూ (బి) అశ్విన్‌ 19; చహర్‌ (సి) మోహిత్‌  (బి) అశ్విన్‌ 39; ధోని నాటౌట్‌ 16; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.1 ఓవర్లలో 5 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–3, 2–27, 3–27, 4–58, 5–114.

బౌలింగ్‌: అంకిత్‌ 4–1–19–2, మోహిత్‌ 3.1–0–28–1, టై 4–0–47–0, అక్షర్‌ 4–0–28–0, అశ్విన్‌ 4–0–36–2.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top