
కామెరూన్ ఇంటికి.. క్రొయేషియా నాకౌట్ ఆశలు సజీవం
వరుసగా రెండు పరాజయాలతో కామెరూన్ జట్టు తగిన మూల్యం చెల్లించుకుంది. గ్రూప్ ‘ఎ’లో అందరికన్నా ముందుగా ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించింది.
మనౌస్: వరుసగా రెండు పరాజయాలతో కామెరూన్ జట్టు తగిన మూల్యం చెల్లించుకుంది. గ్రూప్ ‘ఎ’లో అందరికన్నా ముందుగా ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించింది. భారత కాలమాన ప్రకారం గురువారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్‌లో కామెరూన్‌ను 4-0 తేడాతో క్రొయేషియా జట్టు చిత్తుగా ఓడించింది. ద్వితీయార ్ధంలో రెండు గోల్స్ సాధించిన స్ట్రయికర్ మారియో మన్‌డ్జుకిక్ జట్టు నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచాడు.
1. తమ తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభవంతో కసి మీదున్న క్రొయేషియా ఆటగాళ్లు ప్రారంభం నుంచే ఎదురుదాడికి దిగారు. ఫలితంగా 11వ నిమిషంలోనే వెటరన్ స్ట్రయికర్ ఇవికా ఒలిక్ గోల్ సాధించి 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
2. 40వ నిమిషంలో కామెరూన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మన్‌డ్జుకిక్‌ను మోచేయితో నెట్టిన డిఫెండర్ అలెక్స్ సాంగ్‌ను రిఫరీ రెడ్ కార్డ్ చూపి మైదానం బయటికి పంపడంతో కామెరూన్ పది మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది.
3. 48వ నిమిషంలో పెరిసిక్ పిచ్ మధ్యలో నుంచి సంధించిన షాట్‌ను గోల్ కీపర్ పట్టుకుని వదిలి వేయగా అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చిన పెరిసిక్ మరోసారి ఆ బంతిని గోల్ పోస్టులోనికి నెట్టి జట్టు ఆధిక్యాన్ని పెంచాడు.
4. ఇక 61వ నిమిషంలో కార్నర్ కిక్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా మన్‌డ్జుకిక్ హెడర్ గోల్ సాధించాడు. అలాగే 73వ నిమిషంలోనూ తను చేసిన మరో గోల్‌తో క్రొయేషియా తిరుగులేని విజయాన్ని అందుకుంది.
ఆసక్తికరంగా గ్రూప్ ‘ఎ’
క్రొయేషియా జట్టు గెలుపుతో గ్రూప్ ‘ఎ’లో పోటీ రసవత్తరంగా మారింది. తొలి మ్యాచ్‌లో బ్రెజిల్ చేతిలో ఓడిన ఈ జట్టు కీలకమైన రెండో మ్యాచ్‌లో నెగ్గి నాకౌట్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. అటు బ్రెజిల్, మెక్సికో జట్లు ఒక విజయం, ఒక డ్రాతో సమాన పాయింట్లతో ఉన్నాయి. ఇక మెక్సికోతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే క్రొయేషియా ఆరు పాయింట్లతో నాకౌట్‌కు వెళుతుంది.