
న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ అమెరికన్ ఫ్రొఫెషనల్ సర్క్యూట్ బరిలోకి దిగేందుకు రంగం సిద్ధమైంది. ఇంకా ప్రత్యర్థి ఖరారు కానప్పటికీ వచ్చే నెల 12న అక్కడి స్టేపుల్స్ సెంటర్‌లో అతని పోరు జరుగనుంది. ఎనిమిది రౌండ్ల పాటు ఈ ప్రొఫెషనల్ బౌట్ జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. ఇందుకోసం బాక్సింగ్‌లో కోవిదుడైన విశిష్ట కోచ్ ఫ్రెడ్డీ రోచ్ వద్ద భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ శిక్షణ తీసుకుంటున్నాడు.
గతంలో రోచ్ బాక్సింగ్ దిగ్గజాలు మైక్ టైసన్, పకియావోలకు శిక్షణ ఇచ్చారు. ప్రొఫెషనల్ కెరీర్‌లో విజేందర్ అజేయంగా కొనసాగుతున్నాడు. ఇప్పటిదాకా 10 బౌట్లలో విజయం సాధించిన భారత బాక్సర్ ఇటీవల లాస్ ఏంజిల్స్‌లోని ది వైల్డ్‌కార్డ్ బాక్సింగ్ క్లబ్‌లో శిక్షణ మొదలుపెట్టాడు. 2012లో అంతర్జాతీయ బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేమ్ (ఐబీహెచ్‌ఓఎఫ్)లోకి ఎంపికైన రోచ్... విజేందర్ పంచ్‌లకు పదును పెంచుతున్నాడు. 32 ఏళ్ల సుదీర్ఘ కోచింగ్ కెరీర్‌లో రోచ్.. విజయవంతమైన శిక్షకుడిగా ఘనతకెక్కాడు.