శుబ్‌మన్‌ గిల్‌పైనే అందరి దృష్టి

Big opportunity for young Shubman Gill as India A take on Southafrica - Sakshi

నేటి నుంచి భారత్‌ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ మధ్య వన్డే సిరీస్‌ 

తిరువనంతపురం: భారత సీనియర్‌ జట్టులో చోటు ఆశిస్తున్న కొందరు యువ ఆటగాళ్లకు సొంతగడ్డపై ‘ఎ’ సిరీస్‌ రూపంలో మరో అవకాశం లభించింది. భారత్‌ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ మధ్య ఐదు అనధికారిక వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో నేడు తొలి మ్యాచ్‌ జరుగుతుంది. ఇటీవల అద్భుత ఫామ్‌లో ఉన్నా... దురదృష్టవశాత్తూ విండీస్‌తో సిరీస్‌లో ఎంపిక కాలేకపోయిన శుబ్‌మన్‌ గిల్‌పైనే అందరి దృష్టి నిలిచింది. ఈ సిరీస్‌లోనూ రాణిస్తే అతను మళ్లీ సీనియర్‌ జట్టులోకి రావడం ఖాయం.

ప్రపంచకప్‌లో గాయంతో అనూహ్యంగా దూరమైన ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ కూడా తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు ఈ సిరీస్‌ను ఉపయోగించుకోనున్నాడు. విండీస్‌తో సిరీస్‌ విజయంలో భాగంగా ఉన్నా... చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయిన మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండే, లెగ్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌లు కూడా తిరిగి ఫామ్‌లోకి రావడం ‘ఎ’ సిరీస్‌ సరైన వేదిక కానుంది. ఇతర సీనియర్‌ జట్టు సభ్యులు కృనాల్, ఖలీల్‌ అహ్మద్, దీపక్‌ చహర్‌ కూడా ఈ సిరీస్‌ బరిలోకి దిగుతున్నారు. మరో వైపు దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టులో తెంబా బవుమా, హెండ్రిక్స్, క్లాసెన్, నోర్జేవంటి గుర్తింపు పొందిన అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. ఈ నెల 31న రెండో వన్డే, ఆ తర్వాత సెప్టెంబర్‌ 2, 4, 6 తేదీల్లో మిగిలిన మూడు వన్డేలు జరుగుతాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top