తీవ్ర సాధన చేసిన భువనేశ్వర్‌

Bhuvneshwar Kumar Practiced In Indoor Nets Session In Manchester - Sakshi

మాంచెస్టర్‌ : పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తుండగా కండరాలు పట్టేయడంతో టీమిండియా బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మధ్యలోనే వెనుతిరిగిన సంగతి తెలిసిందే. భూవీ బ్యాకప్‌ ప్లేయర్‌గా నవదీప్‌ సైనీ ఇంగ్లండ్‌కు వెళ్లడంతో అతడి గాయంపై అభిమానుల్లో ఆందోళనలు కలిగాయి. అయితే తాజాగా స్థానిక ఇండోర్‌ నెట్స్‌లో భువనేశ్వర్‌ బౌలింగ్‌ చేసిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోనూ బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. పాక్‌తో మ్యాచ్‌లో గాయపడిన భువనేశ్వర్‌ మళ్లీ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం భారత్‌కు ఊరటకలిగించే వార్తే.

కాగా, అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌లో భువనేశ్వర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన మహ్మద్‌ షమీ హ్యాట్రిక్‌ వికెట్లతో చెలరేగి భారత్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే. కాగా గురువారం ఓల్డ్‌ ట్రాఫర్డ్‌ మైదానంలో వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో భువీ  తుది జట్టులో ఉండే అవకాశాలు తక్కువే. భారత్‌ ఇప్పటికే 5మ్యాచ్‌ల్లో 9 పాయింట్లతో పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని జట్లుగా భారత్‌, న్యూజిలాండ్‌లు దూసుకుపోతున్నాయి. అయితే భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ వర్షంతో తుడిచిపెట్టుకు పోయిన సంగతి తెలిసిందే. 

బుమ్రా, షమీ, భువనేశ్వర్‌లతో కూడిన  భారత్‌ పేస్‌ బలగం మరింత పటిష్టంగా తయారయ్యింది. వరుస విజయాలతో ఊపుమీదున్న భారత్‌కు క్రికెటర్ల గాయాలు ఇబ్బందులు పెడుతున్నాయి. ఇప్పటికే బొటనవేలి గాయంతో శిఖర్‌ ధావన్‌ ప్రపంచకప్‌ టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌ గురువారం వెస్టిండీస్‌తో తలపడనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top