సెమీస్‌తోనే ముగిసిన ప్రయాణం

First Semi Finla of India vs New Zealand Updates - Sakshi

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా ప్రయాణం సెమీస్‌తోనే ముగిసింది. వరుసగా రెండో ప్రపంచకప్‌లోనూ భారత్‌ సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. మరోవైపు న్యూజిలాండ్‌ రెండో సారి ఫైనల్‌కు చేరింది. ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో కోహ్లి సేన 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ప్రపంచకప్‌ కీలక సెమీస్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. కీలక సమయంలో.. టీమిండియాకు అవసరమైన దశలో జడేజా తన సూపర్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 38 బంతుల్లో 3ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో అర్ధ శతకం పూర్తి చేశాడు. జడేజా-ధోనిల సూపర్‌ ఇన్నింగ్స్‌తో టీమిండియా విజయంపై ఆశలు చిగురించాయి. వీరిద్దరూ ఏడో వికెట్‌కు ఇప్పటికే 78 పరుగుల విలువైన భాగాస్వామ్యాన్ని నమోదు చేశారు. 

ప్రపంచకప్‌ సెమీస్‌లో టీమిండియా గెలుపు భారమంతా ధోనిపైనే ఉంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలక సెమీస్‌లో కోహ్లి గ్యాంగ్‌ పెవిలియన్‌కు క్యూ కట్టింది. అయితే పంత్‌-పాం‍డ్యాలు ఐదో వికెట్‌కు 47 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటవ్వడంతో టీమిండియా మరింత కష్టాల్లోకి వెళ్లింది. అయితే క్రీజులో ధోని ఉండటంలో గెలుపుపై ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ధోనితో పాటు రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. 

పాండ్యా అనవసరంగా..
టీమిండియా ఆరో వికెట్‌ను కోల్పోయింది. సాంట్నర్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ పాండ్యా(32) అనవసరపు షాట్‌కు యత్నించి క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రసుత్తం క్రీజులో ధోని(10)తో పాటు జడేజా(0) క్రీజులో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే ఇంకా 148 పరుగుల చేయాలి. దీంతో గెలుపు భారమంతా ధోని పైనే ఉంది. 

ప్చ్‌.. పంత్‌
టీమిండియా రిషభ్‌ పంత్‌(32) వికెట్‌ను కూడా చేజార్చుకుంది. దీంతో 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్‌ చక్కబడిందనుకున్న తరుణంలో సాంట్నర్‌ బౌలింగ్‌లో పంత్‌ భారీ షాట్‌కు యత్నించి క్యాచ్‌ఔట్‌గా వెనుదిరిగాడు. కీలక సమయంలో అనవసర షాట్‌కు యత్నించి ఔటవ్వడంపై డగౌట్‌లో ఉన్న కోహ్లితో సహా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అసహనం వ్యక్తం చేశారు.  

పంత్‌-పాండ్యాలు ఆచితూచి..
కష్టకాలంలో రిషభ్‌ పంత్‌-హార్దిక్‌ పాండ్యాలు నిలకడగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. దీంతో విజయంపై అభిమానుల్లో ఆశలు మొదలయ్యాయి. వీర్దిదరూ ఆచితూచి ఆడుతూ బాధ్యతాయుతంగా ఆడుతున్నారు. ప్రస్తుతం పంత్‌ 27 పరుగులతో, పాండ్యా 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక వీరిద్దరూ వారి శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడుతూ టీమిండియాను కష్టాల్లోంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. 

దినేశ్‌ కార్తీక్‌ ఔట్‌
టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. మ్యాట్‌ హెన్నీ బౌలింగ్‌లో నీషమ్‌ సూపర్‌ క్యాచ్‌ పట్టడంతో సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌(6; 25బంతుల్లో) వెనుదిరిగాడు. దీంతో 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో పంత్‌, పాండ్యాలు ఉన్నారు. కివీస్‌ బౌలర్లలో హెన్నీ మూడు వికెట్లతో చెలరేగగా.. బౌల్ట్‌ కీలక కోహ్లి వికెట్‌ పడగొట్టాడు.

చివర్లో వదిలేశారు..
టీమిండియా టాపార్డర్‌ కుప్పకూలింది. ఇక భారమంతా మిడిలార్డర్‌దే. ఐదు పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఇప్పటివరకు టాపార్డర్‌ రాణింపుతోనే విజయాలను అందుకున్న టీమిండియా.. కీలక సెమీస్‌లో వారు​ చేతులెత్తేశారు. దీంతో మిడిలార్డర్‌ రాణిస్తుందా.. విజయాన్ని అందిస్తుందా లేదా చూడాలి. 

చేతులెత్తేసిన టాపార్డర్‌.. భారమంతా మిడిలార్డర్‌దే
ఆరంభంలోనే టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. ఐదు పరుగులకే టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్‌(1), రాహుల్‌(1), కోహ్లి(1)లు తీవ్రంగా నిరాశపరిచారు. రోహిత్‌ను హెన్నీఔట్‌ చేయగా.. కోహ్లిని ట్రెంట్‌ బౌల్ట్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం బౌల్ట్‌ బౌలింగ్‌లో రాహుల్‌ చెత్త షాట్‌తో కీపర్‌ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో దినేశ్‌ కార్తీక్‌, పంత్‌లు ఉన్నారు. వర్షం కారణంగా పిచ్‌ ఎక్కువగా స్వింగ్‌ అవుతుంది. అంతేకాకుండా అవుట్‌ఫీల్డ్‌ చాలా నెమ్మదిగా ఉంది. 

బరిలోకి దిగారు..
టీమిండియా బ్యాటింగ్‌ ప్రారంభమైంది. కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మలు ఓపెనర్లుగా బ్యాటింగ్‌కు దిగారు. ఆరంభంలో బంతి ఎక్కువగా స్వింగ్‌ తిరిగే అవకాశం ఉండటంతో ఆచితూచి ఆడటం బెటర్‌. తొలి పది ఓవర్లు వికెట్లు పడకుండా ఓపెనర్లు జాగ్రత్తగా ఆడితే టీమిండియాదే విజయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

టీమిండియా లక్ష్యం 240
ప్రపంచకప్‌ తొలి సెమీస్‌లో టీమిండియాకు 240 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ నిర్దేశించింది. నిన్నటి మ్యాచ్‌కు కొనసాగింపుగా ప్రారంభమైన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా మెరుపు పీల్డింగ్‌తో కివీస్‌ పని పట్టాడు. న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. నేటి మ్యాచ్‌ ఆరంభంలోనే రాస్‌ టేలర్‌(74)ను రనౌట్‌ చేసి జడేజా టీమిండియాకు పెద్ద బ్రేక్‌ ఇచ్చాడు. అనంతరం లాథమ్‌(10) ఇచ్చిన క్యాచ్‌ను కళ్లు చెదిరే రీతిలో అందుకోని ఔరా అనిపించాడు. 

ఫలితం తేలేది రిజర్వ్‌డే రోజే!
ఉహించిందే జరిగింది. ప్రపంచకప్‌ తొలి సెమీస్‌కు వరణుడు అడ్డంకిగా నిలిచాడు. దీంతో మ్యాచ్‌ను రిజర్వ్‌డే (బుధవారం)కు వాయిదా వేశారు. ప్రస్తుతం 46.1 ఓవర్లకి న్యూజిలాండ్‌ 211/5తో ఉంది. క్రీజులో రాస్‌ టేలర్‌(67), లాథమ్‌(3)లు ఉన్నారు. రేపటి ఆట న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌తో మొదలవుతుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలివేశాక.. పలు నాటకీయ పరిణామాలు జరిగాయి. రిజర్వ్‌డే అవసరమే లేకుండా మ్యాచ్‌ను ముగించాలనుకున్న అంపైర్లకు నిరాశే ఎదురైంది. 

మైదానాన్ని పరిశీలిస్తున్న అంపైర్లు..
ప్రపంచకప్‌ తొలి సెమీస్‌లో భాగంగా జరుగుతన్న టీమిండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ మరికాసేపట్లో పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత కొద్ది గంటలుగా ఎడతెరిపి కురుస్తున్న వర్షం ఆగడంతో మైదానాన్ని అంపైర్లు పరిశీలిస్తున్నారు. మైదానంలో నిలిచి ఉన్న నీటిని సిబ్బంది సూపర్లతో తొలగిస్తున్నారు. ఇక పిచ్‌, అవుట్‌ ఫీల్డ్‌ను పరిశీలించాక తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే డక్‌వర్త్‌లూయిస్‌ ప్రకారం టీమిండియాకు లక్ష్యాన్ని ఎంత నిర్దేశిస్తారనే దానిపై అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  మ్యాచ్‌ జరిగేది లేనిది భారత కాలమానం ప్రకారం రాత్రి 11.15 గంటలకు అంపైర్లు తమ తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారు. అప్పటికీ మ్యాచ్‌ జరిగే అవకాశం లేకపోతే రిజర్వ్‌డే(బుధవారం)రోజు నిర్వహిస్తారు.

ప్రపంచకప్‌ తొలి సెమీస్‌కు వరణుడు అడ్డంకిగా నిలిచాడు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ ముగియడానికి మూడు ఓవర్ల ముందు చిరుజల్లులతో కూడిన వర్షం పడటంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి కివీస్‌ 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాస్‌ టేలర్‌(67 నాటౌట్‌), లాథమ్‌(3నాటౌట్‌)లు ఉన్నారు.

గ్రాండ్‌హోమ్‌ ఔట్‌
న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ కోలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌(16)ను భువనేశ్వర్‌ ఔట్‌ చేశాడు. భువీ వేసిన స్లో బౌన్సర్‌ను అప్పర్‌ కట్‌ ఆడబోయి గ్రాండ్ హోమ్‌ విఫలమయ్యాడు. దీంతో భువీకి ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌ లభించింది. మరోవైపు రాస్‌ టేలర్‌ తన దైన శైలిలో రెచ్చిపోతున్నాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. 

టేలర్‌ హాఫ్‌ సెంచరీ
న్యూజిలాండ్‌ సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ కీలక మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. కీలక సమయంలో తన అనుభవాన్ని ఉపయోగించి సులువుగా పరుగులు రాబట్టాడు. తొలుత ఆచితూచి ఆడిన టేలర్‌ అనంతరం గేర్‌ మార్చి స్కోర్‌ బోర్డు పరిగెత్తించాడు. విలియమ్సన్‌ అవుటయ్యాక జట్టు బాధ్యతను భుజాలపై వేసుకున్న టేలర్‌ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు.

విలియమ్సన్‌ ఎట్టకేలకు ఔట్‌
భారత్‌తో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో కివీస్‌ స్కోరును చక్కదిద్దిన కేన్‌ విలియమ్సన్‌ ఎట్టకేలకు ఔటయ్యాడు. భారత స్పిన్నర్‌ చహల్‌ వేసిన 36 ఓవర్‌ రెండో బంతికి ఔటయ్యాడు. కవర్స్‌ మీదుగా షాట్‌ ఆడబోయిన విలియమ్సన్‌.. జడేజాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో 134 పరుగుల వద్ద కివీస్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కివీస్‌ పరుగులు చేయడానికి శ్రమిస్తోంది.

విలియమ్సన్‌ హాఫ్‌ సెంచరీ

కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. కివీస్‌ కష్టాల్లో పడ్డ తరుణంలో సమయోచితంగా బ్యాటింగ్‌ చేసిన విలియమ్సన్‌ అర్థ శతకం నమోదు చేశాడు. 79 బంతుల్లో హాఫ​ సెంచరీ మార్కును చేరాడు. 32 ఓవర్లు ముగిసే సరికి కివీస్‌ రెండు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. గప్టిల్‌(1) తొలి వికెట్‌గా, నికోసల్‌(28) రెండో వికెట్‌గా ఔటయ్యారు.

నికోలస్‌కు దిమ్మతిరిగింది..

న్యూజిలాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. లెప్టార్మ్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో నికోలస్‌(28) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. నికోలస్‌ నిష్క్రమణతో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ క్రీజులోకి వచ్చాడు. ఈ జోడిని ఎంత త్వరగా విడదీస్తే టీమిండియాకు అంత లాభం.

విలియమ్సన్‌ @ 500
ప్రపంచకప్‌ 2019లో న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ 500 పరుగుల మైలురాయిని సాధించిన ఆరో ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ సీజన్‌లో రోహిత్‌ శర్మ, డేవిడ్‌ వార్నర్‌, షకీబుల్‌, ఫించ్‌, జో రూట్‌లు కూడా ఐదు వందల పరుగుల సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఇక ప్రపంచకప్‌లో ఐదు వందల పరుగుల సాధించిన రెండో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌గా, తొలి సారథిగా రికార్డు సృష్టించాడు. గత ప్రపంచకప్‌లో మార్టిన్‌ గప్టిల్‌ ఈ మార్క్‌ను అందుకున్నాడు.

కివీస్‌ చెత్త రికార్డు
వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతోంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కివీస్‌ పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. 10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ వికెట్‌ కోల్పోయి 27 పరుగులు చేసింది.  ఫలితంగా ఈ మెగా టోర్నీలో పవర్‌ ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా కివీస్‌ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఇప్పటివరకూ ఇంగ్లండ్‌పై భారత్‌ చేసిన 28 పరుగులు పవర్‌ ప్లేలో అత్యల్ప స్కోరుగా ఉండగా, తాజాగా న్యూజిలాండ్‌ దాన్ని సవరిస్తూ చెత్త గణాంకాల అపప్రథను సొంతం చేసుకుంది.

ఒకటికి ఒకటి..
న్యూజిలాండ్‌ ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. బుమ్రా వేసిన నాల్గో ఓవర్‌లో గప్టిల్‌ పెవిలియన్‌ చేరాడు. బుమ్రా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి తొలి వికెట్‌గా ఔటయ్యాడు. 14 బంతులు ఆడిన గప్టిల్‌ పరుగు మాత్రమే చేశాడు. దాంతో పరుగు వద్దే కివీస్‌ వికెట్‌ను కోల్పోయింది.

మొదటి రెండు ఓవర్లు మెయిడిన్‌
భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్‌ మెయిడిన్‌ కాగా,  బుమ్రా వేసిన రెండో ఓవర్‌ సైతం మెయిడిన్‌ కావడం విశేషం. కాగా, మూడో ఓవర్‌లో కివీస్‌ ఖాతా తెరిచింది. భువనేశ్వర్‌, బుమ్రా ద్వయం కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 8వ ఓవర్‌ వరకు ఫోర్‌ కొట్టలేకపోయింది కివీస్‌

ఆదిలోనే భారత్‌కు షాక్‌
మ్యాచ్‌ ప్రారంభమైన వెంటనే టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోవడంతో ఇన్నింగ్స్‌ను మార్టిన్‌ గప్టిల్‌, హెన్రీ నికోలస్‌లు ఆరంభించారు. కాగా, భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. తొలి ఓవర్‌ను భువనేశ్వర్‌ చేతికి అందించాడు. తొలి బంతికే భువనేశ్వర్‌ కుమార్‌ వికెట్‌ సాధించినంత పని చేశాడు.  భువీ వేసిన తొలి ఓవర్‌ మొదట బంతిని గుడ్‌ లెంగ్త్‌లో సంధించాడు. ఇది కాస్తా గప్టిల్‌ బ్యాట్‌ను దాటుకుని ప్యాడ్లకు తాకింది. దీనిపై భారత్‌ అప్పీల్‌ చేయగా, ఫీల్డ్‌ అంపైర్‌ తిరస్కరించాడు. దానిపై భారత్‌ చివరి క్షణాల్లో రివ్యూకు వెళ్లడంతో ఆ బంతి లెగ్‌ స్టంప్‌కు అతి సమీపం నుంచి బయటకు వెళుతున్నట్లు రిప్లేలో తేలింది. దాంతో భారత్‌కు ప్రతికూల ఫలితం వచ్చింది. దాంతో మొదటి బంతికే భారత్‌ రివ్యూ కోల్పోయింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top