ఈ సీజనే అత్యుత్తమం 

This is the best ipl season - sunil gavaskar - Sakshi

సునీల్‌ గావస్కర్‌ 

ఈ ఐపీఎల్‌లో చాలా మ్యాచ్‌లు ఆఖరి ఓవర్‌దాకా సాగి ఉత్కంఠ రేపాయి. ప్రేక్షకుల్ని చివరిదాకా కుర్చీలకు అతుక్కుపోయేలా చేశాయి. తాజా ఫైనల్‌ పోరులో ఆఖరి బంతే విజేతను తేల్చింది. అసలు సిసలైన ఫైనల్‌ మజానిచ్చింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ చరిత్రలోనే ఈ సీజన్‌ టోర్నీ అత్యుత్తమమైంది. మొత్తానికి ఏటికేడు ఐపీఎల్‌ స్థాయి పెరుగుతూనే ఉంది. ముంబై ఇండియన్స్‌కు అభినందనలు. రోహిత్‌ సారథ్యంలో ముంబై నాలుగో టైటిల్‌ నెగ్గింది. లీగ్‌ చరిత్రలో అతనిప్పుడు విజయవంతమైన కెప్టెన్‌. ఆదివారం ఉత్తమ కెప్టెన్ల మధ్య అత్యుత్తమ సమరమే జరిగింది. బెంగళూరు, చెన్నైల మధ్య బోర్‌ కొట్టిన మ్యాచ్‌తో ఈ సీజన్‌ మొదలైంది. (బెంగళూరు 70 పరుగులకే ఆలౌటైంది) కానీ రానురాను మ్యాచ్‌ల స్వరూపం మారింది.

అయితే నిర్వాహకులు గత చాంపియన్, అట్టడుగున నిలిచిన జట్ల మధ్య కాకుండా విజేత, రన్నరప్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ నిర్వహిస్తే బాగుంటుంది. అలాగే మ్యాచ్‌లు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చూడాలి. కొన్ని మ్యాచ్‌లైతే 4 గంటలపాటు జరిగాయి. 190 నిమిషాలు లేదంటే 200 నిమిషాల్లో మ్యాచ్‌లు ముగిసేలా చర్యలు తీసుకోవాలి. లేట్‌ ఓవర్‌ రేట్‌కు కేవలం ఆర్థిక జరిమానా సరిపోదు... ‘క్రికెటింగ్‌ పెనాల్టీ’లను విధించాలి. తద్వారా వాళ్ల పాయింట్లతో పాటు మ్యాచ్‌లకూ ఇది తీవ్రంగా పరిణమిస్తుంది. ఔటైతే తదుపరి బ్యాట్స్‌మన్‌ 2 నిమిషాల్లో కాకుండా 45 సెకన్లలోనే క్రీజులోకి వచ్చేలా నిబంధనలు తేవాలి. ఓవర్‌ ముగిసిన తర్వాత మొదలయ్యే ఓవర్‌ తొలి బంతికి టైమ్‌ పీరియడ్‌ ఉండాలి. ఆ సమయంలోపు బంతి వేయకుంటే అంపైర్‌ ఫ్రీహిట్‌గా ప్రకటించాలి. అప్పుడే మ్యాచ్‌లు నిర్ణీత సమయంలో ముగించేందుకు ప్రయత్నిస్తారు. పిచ్‌లపై కూడా నిర్వాహకులు దృష్టి పెట్టాలి. ఫైనల్‌ మ్యాచ్‌ సాగినట్లే బ్యాట్స్‌మన్, బౌలర్లకు సమాన అవకాశమిచ్చే పిచ్‌లను రూపొందించాలి. ఇవన్నీ అమలు చేస్తే భవిష్యత్‌లోనూ ఇక ఐపీఎల్‌కు తిరుగుండదు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top