బెన్ స్టోక్స్ పిడిగుద్దులు!

Ben Stokes throws 15 punches in a minute

లండన్: ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. బ్రిస్టల్‌లోని పబ్‌ బయట ఒక వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించిన ఘటనకు సంబంధించి పోలీసులు స్టోక్స్‌ను అరెస్ట్‌ చేసి రాత్రంతా జైల్లో ఉంచారు. విచారణ అనంతరం అతడిని విడుదల చేశారు. సహచర క్రికెటర్‌ అలెక్స్‌ హేల్స్‌ కూడా స్టోక్స్‌తో పాటు ఉన్నాడు. విండీస్‌తో మూడో వన్డేలో ఇంగ్లండ్‌  విజయం అనంతరం సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఒక నిమిషంలో స్టోక్స్ పదిహేను పిడిగుద్దులు కురిపించి సదరు వ్యక్తి తీవ్ర గాయాలు కావడానికి కారణమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియా ఇప్పుడు వైరల్ అయ్యింది.

నేరం రుజువైతే స్టోక్స్‌కు అక్కడి చట్టాల ప్రకారం కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. స్టోక్స్, హేల్స్‌ కోచింగ్‌ క్యాంప్‌కు హాజరు కాలేదంటూ ఈ ఘటనను నిర్ధారించిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు డైరెక్టర్‌ ఆండ్రూ స్ట్రాస్‌... వీరిద్దరిని బుధవారం జరిగే నాలుగో వన్డే నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు. స్టోక్స్‌ ఈ తరహాలో ప్రవర్తించడం ఇది మొదటిసారి కాదు. 2012లో తప్పతాగి రాత్రంతా గొడవ చేయడంతో పోలీసులు అరెస్ట్‌ చేసి హెచ్చరికతో వదిలి పెట్టారు. తర్వాతి ఏడాది ఇంగ్లండ్‌ ‘ఎ’ జట్టు సభ్యుడిగా ఉన్నప్పుడు మళ్లీ తాగుడు కారణంగానే అతడిని జట్టు నుంచి తప్పించారు. 2014లో మత్తులో లాకర్‌పై పిడిగుద్దులు కురిపించి చేతిని గాయపర్చుకున్న అతను టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top