
ముంబై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రాహుల్ జోహ్రి సెలవుపై వెళ్లారు. సోషల్ మీడియాలో మొదలైన ‘మీ టూ’ ఉద్యమంలో గతవారం ఓ మహిళ జోహ్రి లైంగికంగా వేధించినట్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన బోర్డు పాలక కమిటీ (సీఓఏ) వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని జోహ్రికి నోటీసులిచ్చింది.
పేరు బయటపెట్టని ఆ మహిళ ఆరోపణలపై రాహుల్ జోహ్రి బహిరంగంగా స్పందించలేదు. ఖండించనూ లేదు. అయితే వారం రోజులుగా బీసీసీఐ కార్యాలయానికి ఆయన రావడం లేదు. సింగపూర్‌లో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశానికి వెళ్లడం లేదు. తాజా పరిణామాల్ని పరిశీలిస్తే ఆయన సీఈఓగా కొనసాగే అవకాశాలు లేవనే అర్థమవుతోంది.