బీసీసీఐ ఆదాయ మార్గాల అన్వేషణ..!

BCCI Bailout Plan, Play More Matches With India - Sakshi

విదేశీ క్రికెట్‌ బోర్డులకు ఆఫర్‌?

ఎఫ్‌టీపీలో మరిన్ని సిరీస్‌లకు కసరత్తు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా  యావత్‌ ప్రపంచం ఒక్కసారిగా సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో ఆ ప్రభావం క్రికెట్‌ బోర్డులపై కూడా బాగానే పడింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) వంటి బోర్డులు పూర్తిస్థాయి జీతాలు చెల్లింపుల విషయంలో హైరానా పడుతుంటే, మిగతా బోర్డుల పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఇక్కడ ఎంతో కొంత మెరుగైన స్థితిలో ఉన్న క్రికెట్‌ బోర్డు ఏదైనా ఉందంటే అది భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు. ఆటగాళ్ల జీతాల విషయంలో ఎటువంటి కోతల వాతలు పెట్టకుండా ప్రస్తుతానికి సరైన దిశలోనే వెళుతుంది. అయితే రాబోవు రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో కచ్చితంగా చెప్పలేకపోయినా, ఇప్పట్నుంచే ఆదాయ మార్గాల అన్వేషణలో పడింది బీసీసీఐ. మరొకవైపు మిగతా బోర్డుల నష్ట నివారణను కూడా పూడ్చాలని చూస్తోంది. దాని కోసం వచ్చే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) సమావేశంలో చర్చించనుంది. ఇందుకు గాను భవిష్యత్తు టూర్‌ ప్రోగ్రామ్‌(ఎఫ్‌టీపీ)పై బీసీసీఐ దృష్టి పెట్టనుంది. (వార్నర్‌-క్యాండిస్‌ల ‘వేషాలు’ చూడండి..!)

ప్రస్తుతానికి ఖరారై ఉన్న సిరీస్‌లు కాకుండా రాబోవు కాలంలో అదనంగా మరిన్ని ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణ కోసం కసరత్తులు చేస్తోంది.  ఇప్పటివరకూ చవిచూసిన నష్టాన్ని దీని ద్వారా ఎంతోకొంత భర్తీ చేసుకోవడమే కాకుండా, మిగతా బోర్డులకు ఇది ఆసరాగా ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది.2023-2031 కాలానికి సంబంధించి ఎఫ్‌టీపీ వచ్చే ఏడాది ఖరారు చేస్తారు. దీనిలో భాగంగా ముందుగా జరిగే ఐసీసీ సమావేశంలోనే ఒక స్పష్టత వస్తే బాగుటుందనేది బీసీసీఐ యోచన. ఇలా చేస్తే తమతో  పాటు చిన్న దేశాల క్రికెట్‌ బోర్డులకు వెన్నుదన్నుగా ఉంటుందని ఒక బీసీసీఐ అధికారి తెలిపారు.  ప్రధానంగా వచ్చే ఎఫ్‌టీపీలో భారత్‌కు ఎక్కువ మ్యాచ్‌లు ఉండాలనేది బీసీసీఐ ప్లాన్‌. వచ్చే ఏడాది కాలంలో భారత క్రికెట్‌ జట్టుకు నాలుగు విదేశీ పర్యటనలు ఉన్నాయి. ఇందులో శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబాబ్వే, దక్షిణాఫ్రికాలతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయి. దీనికి కంటే టీ20 వరల్డ్‌కప్‌ కూడా ఉంది. ఇది జరుగుతుందా.. లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. వరల్డ్‌కప్‌ వల్ల బీసీసీఐకి పెద్దగా నష్టమేమీ వాటిల్లదు. బీసీసీఐ ప్రధాన ఆదాయ వనరు మాత్రం ద్వైపాక్షిక సిరీస్‌లే. దాంతో సాధ్యమైనన్ని ఎక్కువ ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణ కోసం బీసీసీఐ తమ ప్రయత్నాలను ఆరంభించినట్లే తెలుస్తోంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top