ఏయ్‌ వేషాలు వేస్తున్నావా.. క్రికెటర్‌కు వార్నింగ్‌!

Bangladesh Cricket Chief Nazmul Outburst At Mehidy Hasan - Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌ క్రికెటర్లు తమ డిమాండ్లను నేరవేర్చలాంటూ సమ్మెకు దిగి తమ పంతం నెగ్గించుకున్న తరుణంలో మరో వివాదం చోటు చేసుకుంది. భారత్‌ పర్యటనకు సంబంధించి బంగ్లాదేశ్‌ క్రికెటర్లతో సమావేశమై బీసీబీ చీఫ్‌ నజ్ముల్‌ హసన్‌.. ఆల్‌ రౌండర్‌ మెహిది హసన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన ఫోన్‌ కాల్‌ను మెహిదీ లిఫ్ట్‌ చేయకపోవడంపై సమావేశంలోనే హసన్‌ను తిట్టిపోశారు. ‘ ఏయ్‌ వేషాలు వేస్తున్నావా.. నీ నంబర్‌ డిలీట్‌ చేసేస్తా’ అంటూ ఫైర్‌ అయ్యారు. ‘ మెహిది.. సమావేశం ఉంటుందని తెలుసి కూడా నా ఫోన్‌ కాల్‌ను ఎత్తలేదు. ఇలాగైతే కష్టం. నీ నంబర్‌ను ఈ రోజు నుంచే నా కాంటాక్ట్స్‌ లిస్ట్‌ నుంచి తీసేస్తా. నీకు ఏమి చేయలేదని  నా ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. ఈ రోజు నుంచి నీ నంబర్‌ నా దగ్గర ఉండదు’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. అదే సమయంలో మిగతా క్రికెటర్లపై కూడా నజ్ముల్‌ తీవ్రంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. (ఇక్కడ చదవండి: క్రికెటర్ల స్ట్రైక్‌ దెబ్బకు దిగొచ్చిన బోర్డు)

ఇటీవల తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసన గళం వినిపించకుండా స్టైక్‌కు దిగిన బంగ్లాదేశ్‌ క్రికెటర్ల దెబ్బకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు బీసీబీ దిగొచ్చింది. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నుంచి క్రికెటర్లకు గురువారం స్పష్టమైన హామీ లభించడంతో స్ట్రైక్‌ను విరమించారు. ఈ మేరకు తమ క్రికెటర్లతో సుదీర్ఘ చర్చలు జరిపిన బీసీబీ.. సాధ్యమైనన్ని డిమాండ్లను నేరవేర్చడానికి గ్రీన్‌ సిగ్నల్‌  ఇచ్చింది. మొత్తం 11 ప్రధాన డిమాండ్లతో నిరసన గళం వినిపించగా వాటిలో తొమ్మిది డిమాండ్లను తీర్చడానికి బీసీబీ ముందుకొచ్చింది. ఫలితంగా షకిబుల్‌ హసన్‌ నేతృత్వంలోని క్రికెటర్లు సమ్మె విరమించడంతో భారత్‌ పర్యటనకు మార్గం సుగమం అయ్యింది. దానిలో భాగంగా సమావేశం ఏర్పాటు చేయగా బీసీబీ చీఫ్‌ తన ఆక్రోశాన్ని క్రికెటర్లపై చూపించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top