భారత్‌కు చుక్కెదురు

Bangladesh Beat India in Asian Emerging Cup Under 23 Tournament - Sakshi

బంగ్లాదేశ్‌ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి

అర్మాన్‌ జాఫర్‌ సెంచరీ వృథా

అండర్‌–23 ఆసియా ఎమర్జింగ్‌ కప్‌

ఢాకా: ఒకవైపు బంగ్లాదేశ్‌ సీనియర్‌ జట్టు భారత్‌ చేతిలో తొలి టెస్టులో చిత్తుగా ఓడగా... మరోవైపు ఆసియా ఎమర్జింగ్‌ కప్‌ అండర్‌–23 టోర్నమెంట్‌లో భారత జట్టుపై బంగ్లాదేశ్‌ యువజట్టు ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. శనివారం ఇక్కడ జరిగిన గ్రూప్‌ ‘బి’ వన్డే మ్యాచ్‌లో భారత్‌ బ్యాట్స్‌మన్‌ అర్మాన్‌ జాఫర్‌ శతకం (98 బంతుల్లో 105; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) వృథా అయింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో భారత్‌ 88 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ దశలో అర్మాన్‌ జట్టును నడిపించే భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. స్వేచ్ఛగా షాట్లు కొడుతూ స్కోర్‌ బోర్డును పరుగెత్తించాడు. అతను వినాయక్‌ గుప్తా (65 బంతుల్లో 40; 5 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 125 పరుగులు జోడించాడు. దీంతో భారత్‌ భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే సౌమ్య సర్కార్‌ (2/53) వినాయక్‌ను పెవిలియన్‌కు పంపి బంగ్లాకు బ్రేక్‌ ఇచ్చాడు. అనంతరం బంగ్లా మరో బౌలర్‌ సుమోన్‌ ఖాన్‌ (4/64) అర్మాన్‌ను అవుట్‌ చేసి భారత జోరుకు కళ్లెం వేశాడు.

అనంతరం ఛేదనకు దిగిన బంగ్లా 42.1 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 250 పరుగులు చేసింది. రెండో ఓవర్‌ నాలుగో బంతికి ప్రత్యర్థి ఓపెనర్‌ నైమ్‌ (14)ను ఔట్‌ చేసిన సౌరభ్‌ దూబే భారత్‌కు శుభారంభం అందించాడు. అయితే సౌమ్య సర్కార్‌ (68 బంతుల్లో 73; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), సారథి నజు్మల్‌ (88 బంతుల్లో 94; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 144 పరుగులు జోడించి భారత ఆశలపై నీళ్లు చల్లారు. చివర్లో వీరు అవుటైనా ఆఫిఫ్‌ హుసేన్‌ (46 బం తుల్లో 34 నాటౌట్‌; 5 ఫోర్లు) లాంఛనం పూర్తి చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top