ప్రపంచకప్‌: న్యూజిలాండ్‌పై ఆసీస్‌ విజయం

Australia Won Against New Zealand In World Cup - Sakshi

లండన్‌: ఇప్పటికే సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకున్న కంగారూ జట్టు.. మరో విజయాన్నందుకుంది. శనివారం బౌలర్ల ఆధిపత్యం సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు.. 86 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. 244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ 43.4 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. 40 పరుగులు చేసిన కెప్టెన్‌ విలియమ్సనే ఆ జట్టులో టాప్‌స్కోరర్‌.  మిచెల్‌ స్టార్క్‌ (5/26) నిప్పులు చెరిగే బంతులతో కివీస్‌ పతనాన్ని శాసించాడు. అతనికి తోడు బెరెన్‌డార్ఫ్‌ (2/31) కూడా చక్కటి ప్రదర్శన చేశాడు. అంతకుముందు బౌల్ట్‌ (4/51), ఫెర్గూసన్‌ (2/49), నీషమ్‌ (2/28)ల ధాటికి ఆసీస్‌ ఒక దశలో 92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా.. ఖవాజా (88; 129 బంతుల్లో 5×4), కేరీ (71; 72 బంతుల్లో 11×4)ల అద్భుత పోరాటంతో పుంజుకుని 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.

ట్రెంట్‌ బౌల్ట్‌ హ్యాట్రిక్‌
పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (4/51) హ్యాట్రిక్‌కు తోడు నీషమ్‌ (2/28), ఫెర్గూసన్‌ (2/49) రాణించడంతో శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను న్యూజిలాండ్‌ కట్టడి చేసింది.ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో బౌల్ట్‌ విజృంభించి ఖాజా, స్టార్క్‌ (0), బెహ్రెన్‌డార్ఫ్‌ (0)లను వరుస బంతుల్లో ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ సాధించాడు. దీంతో ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఈ ప్రపంచ కప్‌లో భారత పేసర్‌ మొహమ్మద్‌ షమీ తర్వాత హ్యాట్రిక్‌ సాధించిన రెండో బౌలర్‌ బౌల్ట్‌. 

హ్యాట్రిక్‌ సాధించిన క్రమం...
ఇన్నింగ్స్‌ 50వ ఓవర్‌
మూడో బంతి – ఖాజా (బి) బౌల్ట్‌
నాలుగో బంతి – స్టార్క్‌ (బి) బౌల్ట్‌
ఐదో బంతి – బెహ్రన్‌డార్ఫ్‌ (ఎల్బీడబ్ల్యూ) బౌల్ట్‌

వన్డే కెరీర్‌లో రెండో హ్యాట్రిక్‌ సాధించిన బౌల్ట్‌... ప్రపంచ కప్‌లో ఈ ఘనత నమోదు చేసిన తొలి న్యూజిలాండ్‌ బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top